కొనసాగుతున్న చేప మందు పంపిణీ

Sunday, June 9th, 2013, 03:45:10 AM IST

హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉబ్బస రోగులకు చేపమందు పంపిణీ జరుగుతోంది. శనివారం వరకు ఇప్పటివరకు 50 వేలమంది కి చేపమందు పంపిణి చేసినట్టు నిర్వహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో అస్తమా రోగులు చేప మందుకోసం బారులు తీరారు. ప్రభుత్వం పోలీస్ శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో ఈ సారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాపీగా చేప మందుపంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 32 స్టాల్స్ ను ఏర్పాటు చేసి చేపమందు వేస్తున్నారు. క్యూలలో వేచి ఉన్న రోగులకు సాధ్యమైనంత త్వరగా చేపమందు ఇచ్చేందుకు బత్తెన కుంటుంబం ప్రయత్నం చేస్త్తోంది. క్రితం సారితో పోల్చితే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. పటిష్టమైన సెక్యురిటీతో పాటు మందుకోసం వచ్చిన రోగుల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. కొన్ని స్వచ్చంద సంస్థలు మంచి నీటిని సరపరాతో పాటు ఉచితంగా భోజనాలు పెడుతున్నాయి.

కోర్టు తీర్పులు వివాదాల మధ్య చేపప్రసాదం కోసం వచ్చే భక్తుల తాకిడి తగ్గుతుందనుకున్నా.. గత ఏడాదికంటే ఏమాత్రం తగ్గకుండా రావడంతో రోగుల తో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిటలాడింది. చేపమందు పంపిణీ లో ఎలాంటి లాభాపేక్ష లేదని అందువల్లే ఎన్ని అవాంతరాలు వచ్చిన దేశ వ్యాప్తంగా ప్రజలు తమ ప్రసాదానికి వస్తున్నారని బత్తెన హరినాద్ గౌడ్ అన్నారు.

జనవిజ్ఞాన వేదిక సహా పలు సంఘాలు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా అన్నింటినీ దాటుకుని ఈ ఏడు చేపమందు ప్రసాదం పంపిణీని చేయడంపై బత్తిన హరినాథ్ గౌడ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా రద్దీ, తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అదివారం సాయంత్రం వరకు చేపమందు పంపిణీ కొనసాగనుంది.