ఫ్లాష్ ఫ్లాష్ : పది సెకన్లలో భవనం నేలమట్టం, విషయం ఏంటంటే!

Friday, March 30th, 2018, 04:36:15 PM IST

ప్రస్తుతం మనిషి అన్నివిధాలుగా నూతన ఆవిష్కరణలతో అంచలంచెలుగా ముందుకు దూసుకెళ్తున్నాడు. అన్నింటిలోనూ నూతన పోకడలను అమలుచేస్తూ తన శ్రమను తగ్గించుకుంటూ, తెలివితేటలతో ఎంతో పెద్ద పనిని సులువుగా పూర్తి చేయగలుగుతున్నాడు. అయితే ఈ విధమైన నూతన విధానాలు అన్ని రంగాల్లోనూ ప్రవేశపెడుతున్నారు. అందునా అభివృద్ధి చెందిన అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలు వీటిలో ముందున్నాయి. అలానే నిర్మాణ రంగంలో ఆధునిక పోకడలు బాగా అనుసరించే చైనా, పాత భవంతులను కూల్చడంలోనూ సిద్ధహస్తులేనన్న సంగతి తెలిసిందే. నైరుతి చైనాలోని సిచువాన్‌ ఫ్రావిన్స్‌ చెంగ్డూ నగరంలో ఇటీవల ఓ భారీ భవంతిని నేలమట్టం చేసినప్పటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్‌ అయింది.

పెద్దగా పొగ వ్యాపించకుండా 20 ఏళ్లనాటి భవంతిని కూల్చేసి, అక్కడ మల్టీపర్పస్ కాంప్లెక్స్‌ నిర్మించాలనుకున్న అధికారులు, ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భవంతి చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయించారు. శక్తిమంతమైన డిటోనేటర్లను అమర్చి, ఒక్కసారే పేల్చడంతో ఆ 15 అంతస్తుల బిల్డింగ్ కేవలం 10 సెకన్లలో నేలమట్టమైంది. బిల్డింగ్‌ కూలిన వెంటనే దట్టమైన పొగ అలముకుంది. అయితే ఆ పొగ చుట్టుపక్కలకు వ్యాపించకుండా భారీ సంఖ్యలో డస్ట్‌ క్వికర్లను అమర్చడంతోపాటు, పెద్ద పెద్ద పైపులతో నీళ్లను చల్లారు. పకడ్బందీగా సాగిన కూల్చివేత ఆపరేషన్‌ అనుకున్నట్లే సజావుగా జరగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ అద్భుత దృశ్యాన్ని మీరు కూడా క్రింద వీడియోలో వీక్షించండి…