ఫ్లాష్ న్యూస్ : ఢిల్లీ లో వేడిపుట్టిస్తున్న తెలుగు రాష్ట్రాల రాజకీయాలు!

Wednesday, March 28th, 2018, 11:04:51 AM IST

ఓవైపు ఆంధ్ర లో ప్రత్యేక హోదా ఉద్యమం, మరో వైపు తెలంగాణలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, ఈ విధంగా ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారాయి. అసలే సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సందర్భంగా ఈ రెండు ప్రధాన అధికార పార్టీలు ప్రజల్లో తమ ప్రాభవాన్ని నిలుపుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అలానే మరోవైపు దేశ రాజకీయాల్లో కూటముల కోలాహలం కనిపిస్తోంది. ఈ తరుణంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఢిల్లీ బాట పడుతూ వేడిని పుట్టిస్తున్నారు .

ఏప్రిల్ ప్రారంభంలోనే వీరు ఢిల్లీలో వివిధ పార్టీల నేతల్ని కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ నెల 2వతేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. 3వతేదీన కూడా అక్కడే ఉంటారని సమాచారం. ఈ విషయాన్ని నిన్న సచివాలయంలో జరిగిన అఖిలపక్ష భేటీలో చంద్రబాబు వెల్లడించారు. ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీల నేతలను కలుస్తానని ప్రకటించారు. విభజన చట్టంలో హామీలు అమలు చేయకపోవడం, ప్రత్యేకహోదా నిరాకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని అన్ని పార్టీల నేతలకు వివరించి చంద్రబాబు మద్దతు కూడగట్టనున్నారు. ఇప్పటికే అవిశ్వాసానికి కాంగ్రెస్ సహా ఎన్నో పార్టీలు మద్దతిస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు సర్వ ప్రయత్నాలు చేయనున్నారు.

అయితే మరోవైపు ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కోల్‌కతాకు వెళ్లి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో కేసీఆర్ చర్చలు జరిపారు. కాంగ్రెస్, బీజేపీ యేతర భావసారూప్యతగల జాతీయ పార్టీలతో చర్చలు జరపాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరో వైపు బెంగాల్ సీఎం మమతాబెర్జీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కలసి రావాలని పిలుపిచ్చారు. ఢిల్లీలో టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలతోనూ ఆమె మాట్లాడారు. దేశంలోని ప్రతి పార్టీతో బీజేపీ గొడవ పెట్టుకుందన్నారు. కమలానికి వ్యతిరేకంగా టీడీపీ, టీఆర్ఎ స్‌లతో కలిసి వెళ్లేందుకు సర్వదా సిద్ధమన్నారు మమతా బెనర్జీ. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఢిల్లీలో కలిసే అవకాశం లేకపోయినా, ఇద్దరి పర్యటనల్లో రాజకీయ సమీకరణలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది…..