ఫ్లాష్ న్యూస్ : వైఎస్ జగన్ కు మాజీ కాంగ్రెస్ నేత క్లీన్ చిట్

Tuesday, March 20th, 2018, 12:01:45 AM IST

ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏది మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. దివంగత వుమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వున్నపుడు ఆయనకు మంచి ఆప్తుడుగా ఉండవల్లిని చెపుతుంటారు. అయితే ఈ మధ్య కొన్నాళ్లుగా రాజకీయాలపై ఒకింత మౌనంగా వున్న ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిపు మేరకు ఆయన ఏర్పాటుచేసిన నిజ నిర్ధారణ కమిటీ జేఎఫ్సి లో సభ్యునిగా వున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తాను పవన్ ఆలోచనలు నచ్చి ఆ కమిటీ లో సభ్యునిగా వున్నాను అన్నారు.

ఆయన నేడు ఓ న్యూస్ చానల్ లో మాట్లాడుతూ వైసిపి నేత జగన్ గురించి పలు ఆసక్తికర అంశాలు బయటపెట్టారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి ఆధారాలను బయటపెడితే ఎవరూ పట్టించుకోవడం లేదని ఉండవల్లి అన్నారు. జగన్ లక్ష కోట్లు తిన్నారని టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నా అసలు జగన్ మీద మొత్తం పెట్టిన 13 చార్జీషీట్ల విలువ రూ.1300 కోట్లు అని చెప్పారు. మరి లక్ష కోట్లు అని ఎలా అంటున్నారో టిడిపి కె తెలియాలని జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. అంతేకాదు, ఇటీవల ఓ ఎయిర్ పోర్టులో జగన్ ను తాను కలిశానని, ఆ సందర్భంగా ఆయన ఇంకో విషయం చెప్పారని అన్నారు.

అన్నా మీరు 1300 కోట్లకు చార్జి షీటు ఉందని చెప్తున్నారు. కానీ అందులో రూ.500 కోట్ల విలువకు సంబంధించి కేసులు క్లియర్ అయిపోయాయి. ఇంకా రూ.800 కోట్లపైనే వివాదం ఉంది అని చెప్పారు అన్నారు. రూ.800 కోట్లకు కేసులున్న వ్యక్తిపై రూ.లక్ష కోట్లు అంటూ నిందలేయడం సరికాదని ఉండవల్లి అన్నారు. అయితే జగన్ తనపై ఉన్న కేసుల గురించి ప్రజలకు వివరిస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు. ఈ విషయం తాను జగన్ తో, ఆ పార్టీ వాళ్లతో పలుమార్లు చెప్పానని, జగన్ కూడా అసెంబ్లీలో ఈ విషయం చెప్పారట కానీ తాను అప్పుడు వినలేదని ఉండవల్లి అన్నారు. తండ్రి సీఎం అయినంత మాత్రాన ఎవరూ బిజినెస్ చేయకూడదని రూలేమీ లేదని అన్నారు.

అంతేకాదు జగన్ వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడి రూ.1300 కోట్లు అన్నారు. అదే లంచం అయితే దానికి రసీదు ఇస్తారా అని అడిగారు. కానీ జగన్ వారికి షేర్లు ఇచ్చి , రసీదు ఇచ్చారని, ఇది క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని ఉండవల్లి ప్రశ్నించారు. అయితే జగన్ రసీదు ఇచ్చాడు కాబట్టి ఇలా కేసుల్లో ఇరుక్కుపోయాడని అన్నారు. అంతేకాదు జగన్ వద్ద ఎంత డబ్బుందో కూడా ఉండవల్లి చెప్పారు. జగన్ వద్ద ఉన్న డబ్బు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో రిజిస్టర్ అయి ఉన్నవే తప్ప ఒక్క రూపాయి ఎక్కువ లేదని, కానీ ఈ విషయాన్ని జగన్ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదో తెలియడం లేదన్నారు. అంత డబ్బు లేదని తెలిస్తే ప్రమాదమని జగన్ భావిస్తున్నారేమో అని ఆయన అన్నారు….