కోదండరాం గారి పార్టీ పేరు ఇదే!

Monday, April 2nd, 2018, 04:18:42 PM IST

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్రపోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలోని టిజెఎసి గత కొద్దిరోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోను అలానే టిఆర్ ఎస్ పార్టీ తోను విబేధిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా టిఆర్ ఎస్ కు పోటీగా కోదండరాం కూడా టిజెఎసి ని ఒక పార్టీగా ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు కొన్ని ప్రయత్నాలు ప్రారంభించిన విషయం విదితమే. టీజేఏసీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే క్రమంలో గత కొన్నాళ్లుగా అంతర్గతంగా కీలక చర్చలు కూడా జరుగుతున్నాయి.

ఇటీవలే పార్టీ ఏర్పాటుకు లాంఛనంగా సమ్మతి తెలిపిన కోదండరాం, ఆ దిశగా కొన్నిరోజులుగా సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. అయితే మొత్తానికి తన స్థాపించబోయే పార్టీ పేరును నేడు ఆయన వెల్లడించారు. తెలంగాణ జనసమితి పేరిట పార్టీని ఏర్పాటుచేస్తున్నట్టు సోమవారం కోదండరాం అధికారికంగా తెలిపారు. ఈ నెల 29న హైదరాబాద్‌లో తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభ ఉంటుందని అన్నారు. పార్టీ పేరును ప్రకటించడంతోపాటు, పార్టీ ఆవిర్భావ సభ హైదరాబాద్‌లో ఉంటుందని తాజాగా వెల్లడించారు.

జేఏసీ చైర్మన్‌గా ఉద్యమంలో విశేషమైన పాత్ర పోషించిన కోదండరాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ఎన్నికల్లో జేఏసీ ఒకరకంగా తటస్థమైన పాత్రనే పోషించింది. ఆ తర్వాత క్రమంగా జేఏసీ టీఆర్‌ఎస్‌కు దూరం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా కేసీఆర్‌ పరిపాలన విధానంపై జేఏసీ చైర్మన్‌ కోదండరాం గతకొంతకాలంగా పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం, అలానే బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేకూర్చేలా చేయడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని అందుకే తాను పార్టీ పెడుతున్నట్లు కొండాదండారం చెప్పుకొచ్చారు….