లక్ష కోట్లకి ఫ్లిప్ కార్ట్ అమ్ముడు పోయిందా.. ఎవరు కొన్నారో?

Friday, May 4th, 2018, 03:56:23 PM IST

సంస్థలో 75 శాతం వాటాను వాల్‌మార్ట్‌కు అమ్మే ప్రతిపాదనకు ఫ్లిప్‌కార్ట్ బోర్డు ఆమోదం తెలిపినట్లు తెలుస్తున్నది. 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ. లక్ష కోట్లు)కు డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ డీల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో తమ 20 శాతం వాటాను జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ రూపంలో విక్రయించనుంది. మరో పది రోజుల్లో ఈ డీల్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వాల్‌మార్ట్‌తో కలిసి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ పెట్టుబడి పెట్టే అవకాశాలున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో 60 శాతం వాటా కోసం చూసిన అమెజాన్ ఇక రేసు నుంచి తప్పుకున్నట్లే.

మొదటి నుంచీ అమెజాన్ కూడా వాటా కొనుగోలు కోసం ప్రయత్నించినా.. ఫ్లిప్‌కార్ట్ బోర్డు సభ్యులు మాత్రం వాల్‌మార్ట్‌వైపే మొగ్గుచూపుతూ వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద రీటెయిలర్‌గా పేరున్న వాల్‌మార్ట్‌కు అమెజాన్ నుంచి గట్టి పోటీ వచ్చింది. ఇంటర్నెట్ ద్వారా కొనుగోళ్లు పెరగడంతో అమెజాన్.. వాల్‌మార్ట్‌కు సవాలు విసిరింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకుంటే గనక.. అమెజాన్‌కు వాల్‌మార్ట్ గట్టి పోటీ ఇవ్వనుంది. అమెరికా, చైనా తర్వాత ఇండియాలోనే ఆ స్థాయి మార్కెట్ ఉంది. ఇప్పటికే ఇండియాలో అమెజాన్ భారీగా పెట్టుబడులు పెడుతున్నది. ఫ్లిప్‌కార్ట్ తర్వాత రెండోస్థానంలో ఉన్న అమెజాన్.. ఇండియాలో మరో 550 కోట్ల డాలర్లు పెట్టుబడికి సిద్ధంగా ఉంది.

Comments