డెలివరీ లేట్ చేసినందుకు కొరియర్ బాయ్ కి 20 కత్తి పోట్లు!

Thursday, March 29th, 2018, 06:47:08 PM IST

ప్రస్తుత సమాజంలో కొందరి ప్రవర్తన చూస్తుంటే అసలు మనం మానవత్వం, విలువలున్న సమాజంలోనే బ్రతుకుతున్నామా అనిపిస్తోంది. నిజానికి దేవుడు జంతువులకు ఇవ్వనిది, మనిషికి ఇచ్చింది ఆలోచించే మెదడు. ఏది మంచో ఏది చెడో ఆలోచించగల మనం, మనచుట్టూ ఉన్నవారికి మంచి చేయకపోయినా పర్లేదుగాని, పరిస్థితులని బట్టి చెడు మాత్రం చేయకూడదని మన పెద్దలు చెపుతుంటారు. అయితే ఇటీవల జరిగిన ఒక సంఘటన వింటే ఎంతటివారికైనా గుండె గుభేలుమనక మానదు. విషయంలోకి వెళితే ఢిల్లీ లోని నిహాల్ విహార్ ప్రాంతంలో కమల్ దీప్ అనే మహిళ ఫ్లిప్ కార్ట్ లో మొబైల్ ఫోన్ బుక్ చేసింది.

అయితే ఈనెల 21వ తేదీన ఆ మొబైల్ ఆమెకు డెలివరీ చేయబడుతుంది అని మెసేజి వచ్చింది. ఆ రోజు మొబైల్ కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన మహిళకు మొబైల్ డెలివరీ చేయడంలో కొంత ఆలస్యం చేసిన డెలివరీ బాయ్ కేశవ్ ఎట్టకేలకు మొబైల్ ఆమెకు డెలివరీ ఇచ్చాడు. అయితే కేశవ్ ఆలస్యానికి తట్టుకోలేకపోయిన కమల్ దీప్ మరియు ఆమె సోదరుడు జితేందర్ సింగ్ అతని పై ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 20 సార్లు కత్తిపోట్లతో దాడి చేసిగాయపరిచారు. అంతేకాక అతనివద్ద వున్న ఇతర డెలివరీ ఐటమ్స్ తాలూకు రూ. 40,000 లను లాక్కుని అతన్ని దగ్గర్లోనే డ్రైనేజీ వద్ద పడవేశారు.

అయితే అటుగా వెళ్తూ కేశవ్ పరిస్థితిని చూసిన స్థానిక పోలీస్ ఒకరు వెనువెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అయితే చికిత్స అనంతరం కాస్త కోలుకున్న కేశవ్ జరిగిన ఉదంతాన్ని పోలీస్ లకు వివరించాడు. అతని ఫిర్యాదు మేరకు కమల్ దీప్ మరియు అతని సోదరుడు జితేందర్ సింగ్ ను పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే కమల్ దీప్ తరచు చుట్టుప్రక్కల వారితో గొడవలు పడుతూ ఉంటుందని, ఆమెకు షార్ట్ టెంపర్ ఉండేదని స్థానికులు చెపుతున్నారు….