చప్రాసీ నుంచి మండలి చైర్మన్ వరకు- స్వామిగౌడ్ ప్రస్థానం!

Thursday, July 3rd, 2014, 10:43:44 AM IST

swamee-goud
అదృష్ణం అందరినీ వరించదు. కొందరినే వరిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో టీ అమ్మేవాడు ప్రధాని కావచ్చు అని నరేంద్ర మోనీ నిరూపిస్తే… చప్రాసీ(అటెండర్) కూడా అత్యున్నత స్థాయిన పదవిని పొందవచ్చని నిరూపించారు స్వామిగౌడ్. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగులందర్నీ ఏకతాటిపైకి తీసుకురావడంలో స్వామీగౌడ్‌ పాత్ర మరవలేనిది. చప్రాసి ఉద్యోగంలో చేరిన తాను మండలి ఛైర్మన్‌ అయ్యేందుకు మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థనే కారణమని స్వామిగౌడ్ గుర్తు చేసుకున్నారు.
రాజేంద్రనగర్ లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉద్యోగ జీవితం ప్రారంభించిన స్వామిగౌడ్ 1969 ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. 1969లో వీరోచితంగా పోరాడటం, బుల్లెట్ భుజంలో దూసుకుపోయినా మొక్కవోని దీక్షతో తెలంగాణ మలిదశ ఉద్యమంలో టీఎన్జీవో నాయకుడుగా, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌గా కీలకభూమిక పోషించడం సకల జన సమ్మె యోధుడుగా తెలంగాణ ప్రజల ప్రశంసలందుకోవడం స్వామిగౌడ్‌కు లభించిన అరుదైన గౌరవమని టీఆర్ఎస్ నేతలు కొనియాడారు.
ఆ తర్వాత ఉద్యోగ సంఘాల్లో కీలకపాత్ర పోషించారు. టీఎన్జీవో అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఉద్యోగుల సహకారంతో సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చి దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం, పోరాటాన్ని గుర్తించేలా చేశారు. 2012లో పదవీవిరమణ చేసిన స్వామిగౌడ్ టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో శాసనమండలి చైర్మన్ గా ఎన్నికయ్యారు. సభను అధికార, ప్రతిపక్ష సభ్యుల సహకారంతో హుందాగా నడిచేలా కృషి చేస్తానని స్వామిగౌడ్ అన్నారు.

స్వామిగౌడ్ వ్యక్తిగతం..
పూర్తి పేరు : కనకమామిడి స్వామిగౌడ్
పుట్టిన తేది : జూలై 5, 1954
తల్లిదండ్రులు : నర్సమ్మ, లక్ష్మయ్య
స్వస్థలం : కిస్మత్‌పూర్ గ్రామం,
రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా
విద్యార్హత : బీఎస్సీ
భార్య : మనోరమ
సంతానం : కొడుకు, ఇద్దరు కూతుళ్లు

  •  
  •  
  •  
  •  

Comments