ఇక పై అక్కడ సెల్ఫీ లు దిగడం నిషేధం!

Saturday, March 24th, 2018, 06:12:17 PM IST


సెల్ ఫోన్ రాకతో మన జీవితంలో చాలా వరకు టెక్నాలజీ మన చేతుల్లోకి వచ్చినట్లయింది. మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఫోటోలు దిగాలంటే ప్రత్యేకంగా కెమెరా చేతపట్టుకు వెళ్లవలిసి వచ్చేది. కానీ నేడు జేబులో సెల్ ఉంటేచాలు ఎక్కడికెళ్లినా మనకు అక్కడ నచ్చిన వాటిని క్లిక్ మనిపించవచ్చు. ఇటీవలి కాలంలో అయితే సెల్ లోని ఫ్రంట్ కెమెరా తో తీసే సెల్ఫీ లకు క్రేజ్ మరీ పెరిగింది. ప్రతిఒక్కరు తమ వారితోనో, లేక అనుకోకుండా ఎవరైనా ప్రత్యేక వ్యక్తులు, లేదా సెలెబ్రిటీ లను కలిసినపుడో సెల్ఫీ లు దిగి భద్రపరుచుకుంటారు. అయితే ఈ సెల్ఫీ పిచ్చి వల్ల కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కూడా లేకపోలేవు. అయితే ప్రస్తుతం ఈ సెల్ఫీ లను తాజాగా ఒకచోట నిషేదించారు. రెడ్‌ కార్పెట్‌పై తారల తళుకుబెళకుల మధ్య కెమెరా ఫ్లాష్‌లైట్‌లు జిగేల్‌మంటుంటే ఆ ఉత్సాహ భరిత సినీ అభిమానులకు కన్నుల పండగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్.

‘కేన్స్‌’వంటి చిత్రోత్సవాల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయా సినిమాల ప్రీమియర్‌ షో ప్రదర్శనలప్పుడు తాజా ఫ్యాషన్‌ను పరిచయం చేస్తూ నటీనటులు చేసే సందడి అలరిస్తుంటుంది. ఇక వారితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు అమితాసక్తిని ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఇక కేన్స్‌ చిత్రోత్సవాల్లో ప్రేక్షకులు సెల్ఫీలు దిగేందుకు నిషేధం విధించారు. రెడ్‌ కార్పెట్‌పై ప్రేక్షకులు సెల్ఫీలు దిగడాన్ని నిషేధిస్తున్నాం అని కేన్స్‌ చిత్రోత్సవ నిర్వాహకుడు థెర్రీ ఫ్రెమాక్స్ ఓ ఫ్రెంచ్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‌సెల్ఫీల కారణంగా ప్రదర్శనకు వెళ్లేప్పుడు చాలా మంది క్రమంలో వెళ్లకుండా నిలిచిపోతున్నారని దీని కారణంగా అసౌకర్యంగా ఉంటోందని, మెట్లు ఎక్కేటప్పుడు పలువురు ప్రముఖులకు ఇబ్బందిగా ఉంటోందని వివరించారు.

ఇది మొత్తం కార్యక్రమంపైనే ప్రభావం చూపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ప్రీమియర్స్‌ గౌరవాన్ని, ప్రతిష్ఠను కాపాడతాయని చెప్పారు. తాజా నిర్ణయం కేవలం ప్రేక్షకులకు మాత్రమే వర్తింస్తుందా లేక ఆయా సినిమాల తారాగణానికి కూడా వర్తింప జేస్తారా అనే అంశంపై స్పష్టత లేదు. కేవలం ప్రేక్షకులే కాదు హాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు సైతం కేన్స్‌లో రెడ్‌ కార్పెట్‌పై సెల్ఫీలు దిగుతూ తమ సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో పోస్టు చేస్తుంటారు. మరోవైపు విమర్శకులు ఈ నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు. ఇక్కడికి ఎన్నో ఆశలతో తమ అభిమాన నటులను చూడటానికి వచ్చే అభిమానులకు ఇది చేదు వార్త అనే చెప్పవచ్చు….