ఇకనుండి మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్ : జనసేన అధినేత పవన్

Sunday, May 27th, 2018, 07:13:03 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజా పోరాట యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. తనకు ప్రజా సమస్యలపై అవగాహన కోసం ఈ యాత్ర చేపట్టినట్లు ఇటీవల పవన్ తెలిపారు. కాగా నేడు ఆయన యాత్ర శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరుగుతోంది. అక్కడ స్థానిక ప్రజలను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ శ్రీకాకుళంలో ఎక్కడికెళ్లినా ప్రజల ఆర్తనాదాలు, కన్నీటి గాథలే వినిపిస్తున్నాయని, ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ అందరికి న్యాయం చేసాము అంటూ దగాకోరు అబద్దాలు చెపుతోందని మండిపడ్డారు. ఇదివరకు ఎన్నోసార్లు టీడీపీ ప్రభుత్వానికి, సీఎం గారికి ఇక్కడి ప్రజల సమస్యలపై స్పందించమని అడిగానని, అయినప్పటికీ వారు చూసి చూడనట్లు వ్యవహరించి తప్పించుకుంటున్నారు అన్నారు.

అందువల్ల ఇకపై మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవని, మేము చేయదల్చుకుందేమిటో చేతల్లో చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజలు టీడీపీ నేతల అకృత్యాలకు పూర్తిగా విసిగిపోయి వున్నారని, ఉమ్మడిగా వున్న రాష్ట్రం నేడు విడిపోయి ఒంటరిగా పలు సమస్యలు ఎదుర్కొంటుంటే ఆ టిడిపి పార్టీనేతలు ఒంటరి రాష్ట్రాన్ని అందినతంత దోచుకుంటున్నారని విమర్శించారు. తన మద్దతుతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఒకవేళ మీరు ప్రజలకు మంచి చేయకపోతే వారితరఫున నేను గట్టిగా ప్రశ్నించవలసి వస్తుంది అని అప్పుడే చెప్పాను అన్నారు. అప్పుడేమో ఓట్ల కోసం మా మద్దతు తీసుకున్నారు, ఇప్పుడేమో ప్రజలకు ఎందుకు న్యాయం చేయరు అని ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఇకపై టిడిపి నేతల ఆగడాలు ఇక్కడ చెల్లవని, వాళ్ళ పార్టీకి ఇక్కడ నూకలు చెల్లాయని, వారసత్వపు రాజకీయాలతో మీరు చేస్తున్న ఆగడాలు ఇంకచెల్లవు చంద్రబాబు గారు అని హెచ్చరించారు….

  •  
  •  
  •  
  •  

Comments