మహాకూటమిలో కుంపట్లు పెట్టిన కూకట్ పల్లి !

Tuesday, October 9th, 2018, 05:49:29 PM IST

హైదరాబాద్ నగరంలో రాజకీయ భవిష్యత్తు ఉండాలని ఆశపడే ఆంధ్రప్రాంత నాయకులు ఎన్నికల్లో పోటీ చేయవలసి వస్తే ముందుగా ఆశపడే నియోజకవర్గం కూకట్ పల్లి. మినీ ఆంధ్రాగా పేరున్న ఈ నియోజకవర్గంలో నిలబడితే ప్రాంతీయ అభిమానం పనిచేసి గెలుపు సులభమవుతుందని అందరి అంచనా.

ఈ అంచనాలే ప్రస్తుతం మహాకూటమిలో రాజకీయాల్ని వేడెక్కేలా చేస్తోంది. 2014 లో ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు ఏలూరి రామచంద్రా రెడ్డి ఈసారి ఈ నియోజకవర్గం నుండే పోటీకి దిగాలని గట్టిగా నిర్ణయించుకుని అధిష్టానం పెద్ద రాహుల్ గాంధీ వైపు నుండి ప్రయత్నాలు మొదలుపెట్టగా తెలుగుదేశం సీనియర్ నేత ఇనుగాల పెద్ది రెడ్డి సైతం ఇక్కడి నుండే పోటీ చేయాలని కంకణం కట్టుకున్నారట.

ప్రస్తుతం కూటమిలో నడుస్తున్న ఈ పోటీ రసవత్తరంగా మారింది. ఇక మధ్యలో సీపీఐ, జనసమితి నేతలు కొందరు ఈ స్థానం కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నట్టు సమాచారం. తీవ్ర పోటీకీ కారణమైన ఈ టికెట్ చివరికి ఎవరికి దక్కుతుందో చూడాలి.