‘గాలి’ కూతురి పెళ్లి ముందు ‘మంగళ్ యాన్’ కూడా చిన్నబోయింది..!

Tuesday, November 15th, 2016, 11:45:53 AM IST

gali
భారత దేశంలో పెళ్లిళ్ల ఖర్చు ఎక్కువే. కానీ ఒక పెళ్లికి రూ 500 కోట్లు ఖర్చు పెట్టడం బహుశా భారత దేశ చరిత్రలో ఇంతవరకు జరగలేదేమో.ప్రస్తుతం దేశం లో రెండే హాట్ టాపిక్స్ .. ఒకటి పెద్దనోట్ల రద్దు.. రెండోది కరెన్సీ నోట్ల రద్దుతో దేశం లో ఎమర్జెన్సీ ని తలపించే పరిస్థితులు నెలకొనిఉన్నా కోట్లకు కోట్ల ఖర్చుతో జరుగుతున్న మైనింగ్ డాన్ గాలిజనార్ధన్ రెడ్డి కూతురి వివాహం. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ వివాహాన్ని గాలి జరిపిస్తుండడం విశేషం. దీనికోసం బెంగుళూరులో రాజ మహల్ ను తలపించేలా భారీ సెట్టింగులను వేశారు.దేశం నలు మూలాల నుంచి అతిరథ మహారధులందరూ హాజరవుతుండడం విశేషం.ఇటీవల ఈ వివాహానికి సంబందించిన ఖర్చు రూ 200 కోట్లు ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం పలు జాతీయ మీడియా సంస్థలు ఈ ఖర్చు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రూ 500 కోట్లకు చేరిందని కథనాలను వెలువరుస్తున్నాయి.

దేశంలోని సినీ రాజకీయ ప్రముఖములందరూ ఈ వేడుకకి హాజరవుతుండడం విశేషం. ఈ నెల 16 న ఈ వేడుక బెంగుళూరు ప్యాలెస్ లో జరగనుంది.ఇంతటి భారీ ఖర్చుతో జరుగుతున్న ఈ వివాహం పై కర్ణాటకలో విమర్శలు కూడా పెద్దఎత్తున వస్తున్నాయి. కర్ణాటక లో తన రాజకీయ ప్రత్యర్థి అయిన తపల్ గణేష్ ఈ వివాహం పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక ఆరోగ్య శాఖామంత్రి రమేష్ కుమార్ తాను ఈ వివాహానికి హాజరు కానని ప్రకటించారు. ఇంతటి ఖర్చుతో వివాహం జరిపించాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాగా ఇప్పటికే గాలి జనార్ధన్ రెడ్డి పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.అక్రమ మైనింగ్ వ్యవహారం లో ఆయన అరెస్టు అయి బెయిల్ పై విడుదలయ్యారు. 2007- 2011 మధ్యకాలం లోనే దాదాపు రూ 1200 వందల కోట్లవరకు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిపిస్తున్న వివాహానికి గాలి ఎక్కడి నుంచి నిధులు సమకూర్చుకుంటున్నాడో అని ఐటి అధికారులు కూడా ఓ కన్ను వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం దేశం లో ఆర్థిక ఎమర్జన్సీ ని తలపించే పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో వివాహాన్ని ఇంతటి భారీ స్థాయిలో ఎలా జరిపించగలుగుతున్నాడనే అనుమానాలు కలుగుతున్నాయి.రూ 500 కోట్లు అంటే మాటలు కాదు. ఇస్రో శాస్త్ర వేత్తలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళ్ యాన్ ప్రాజెక్ట్ కూడా గాలి కూతురి వివాహం ముందు చిన్నబోతుందనడంలో సందేహం లేదు. మంగళ్ యాన్ ప్రాజెక్ట్ కు ఖర్చైన మొత్తం రూ 450 కోట్లే. కరెన్సీ కొరత ఏర్పడిన ప్రస్తుత్తరుణంలో గాలి ఈ వివాహాన్ని ఎలా జరిపించగలుగుతున్నాడనే అనుమానాలకు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గాలి దాదాపు ఆరునెలల క్రితమే ఈ వివాహ ఏర్పాట్లకు సంబందించిన లావాదేవీలను పూర్తిచేసినట్లు వార్తలు వస్తున్నాయి.అంతేకాక కరెన్సీ కొరత నేపథ్యంలో గాలి తన సింగపూర్ లోని ఆస్తులని తాకట్టు పెట్టి మరీ ఈ వివాహాన్ని జరిపిస్తున్నాడని జాతీయ మీడియా కోడై కూస్తోంది. కాగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ వివాహం జరగనుంది. దాదాపు 3000 మంది బౌన్సర్లు, ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బంది నడుమ ఈ వివాహం జరగనుంది. 5వేలమంది విఐపి లు, 5 లక్షల మంది సాధారణ ప్రజలు ఈ వివాహానికి హాజరు కానున్నట్లు అంచనా వేస్తున్నారు.