విద్యాకేంద్రంగా ఏపీ

Friday, September 26th, 2014, 03:15:52 PM IST


ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో విడుదల చేయనున్న డిఎస్సీలో ఎస్జీటీ పోస్ట్ లు ఎక్కువగా ఉన్నందున బీఈడీ అభ్యర్ధులకు ఆ పోస్టులు ఇప్పించాల్సిందిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని, ఎన్ సీటీఈ అధికారులను కోరామని వివరించారు. అలాగే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే లోపే దీనిపై నిర్ణయం తీసుకుంటే బీఈడీ విద్యార్ధులకు న్యాయం జరుగుతుందని గంటా అభిప్రాయపడ్డారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ అలహాబాద్ ట్రిపుల్ ఐటి తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్రిపుల్ ఐటి మంజూరు చెయ్యాలని కేంద్రానికి విజ్ఞ్యప్తి చేసినట్లు తెలిపారు. విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన కేంద్రీయ విద్యాలయాలు వచ్చే ఏడాది నుండే మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు గంటా వివరించారు. అలాగే వచ్చే నెలలో విశాఖలో జరిగే విద్యా సదస్సుకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఆహ్వానించినట్లుగా మంత్రి పేర్కొన్నారు. ఇక తమ ప్రభుత్వం తెలంగాణ సర్కారు లాగ తొందరపాటు నిర్ణయాలను తీసుకోదని, అందిరికీ ఉపయోగపడేలా ఆంధ్రప్రదేశ్ ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని గంటా శ్రీనినివాసరావు స్పష్టం చేశారు.