గంటా భూక‌బ్జాల విలువ 6వేల కోట్లు?

Friday, July 13th, 2018, 10:24:43 PM IST


విశాఖ రూర‌ల్‌లో తేదేపా మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు భూక‌బ్జాల గురించి ఇప్ప‌టికే మీడియా కోడై కూసింది. ఆయ‌న చెయ్యి వెయ్య‌ని చోటుందా? అంటూ నిర్ఘాంత‌పోయే నిజాలెన్నిటినో ప్ర‌త్య‌ర్థి మీడియాలో బ‌య‌ట‌పెట్టాయి. తాజాగా సాక్షి ప‌త్రిక‌లో వ‌చ్చిన ఓ క‌థ‌నం నోరెళ్ల బెట్టే నిజాల్ని వెలికి తీసింది. ఈ క‌థ‌నం ప్ర‌కారం.. గంటా అక్ర‌మాలు అన్నీ ఇన్నీ కావ‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అధికారంలో ఉన్న‌ది బావ‌గారే అయితే ఆట ఎలా అయినా ఆడొచ్చ‌న్న సంగ‌తి అర్థ‌మైంది.

విశాఖ రూరల్‌ మండల పరిధిలోని పరదేశిపాలెం, పోతినమల్లయ్యపాలెం, ఎండాడ, రుషికొండ, చినగదిలి, భీమునిపట్నం ప్రాంతాల్లో గంటా చిక్కిన ప్ర‌తిచోటా చెయ్యేశారు. భూక‌బ్జాల‌కు తెర తీశారు. మాజీ సైనికుల‌ను బెదిరించి భూముల్ని చౌక బేరానికి కొనేశాడ‌న్న విమ‌ర్శ‌లున్నాయి. జిల్లా కేంద్ర గ్రంధాలయాన్నే లేపేయాల‌ని చూశార‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. ఇక‌పోతే వియ్యంకుడు మంత్రి నారాయ‌ణ కాపు కాయ‌డంతోనే గంటా అవినీతి ఇప్ప‌టికీ బ‌య‌ట‌ప‌డ‌లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు విశాఖ ప‌రిధిలో 6వేల కోట్ల విలువ చేసే భూ స్కామ్‌ల‌పై మంత్రి అయ్య‌న్నపాత్రుడు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వీట‌న్నిటా గంటా హ‌స్తం ఉంద‌ని ఆయ‌న ఇదివ‌ర‌కూ బ‌య‌టికే అక్క‌సు వెల్ల‌గ‌క్కిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో విశాఖ భూ స్కామ్‌ల‌పై సిట్ ద‌ర్యాప్తు సాగినా, అది తూతూనే అని తేలిపోయింది. ఇక బీయీడీ, ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల విష‌యంలో గంటా అవినీతికి పాల్ప‌డ్డారని ఈ క‌థ‌నం పేర్కొంది. ఆ మేర‌కు జ‌న‌సేన ప్ర‌తినిధి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌రా అంటూ స‌ద‌రు క‌థ‌నం ఉర‌క‌లెత్తించింది. ఇక‌పోతే ప్రకృతి రియ‌ల్ ఎస్టేట్ పేరుతో లంకెల పాలెం ఏరియాలో, అలానే పెందుర్తి హైవేలో గంటా వేసిన హోర్డింగులు, బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. వేలాది ఎక‌రాల్లో విస్త‌రించిన ఈ రియ‌ల్ ఎస్టేట్ విలువ వేల కోట్లు ఉంటుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments