గేల్ ఈజ్ బ్యాక్.. చెన్నైకి చుక్కలు చూపించాడు

Monday, April 16th, 2018, 09:29:17 AM IST

ఒకప్పుడు తాను గ్రౌండ్ లోకి అడుగుపెడితే బంతికి భయం పట్టుకునేది. అతను ఎవరో అందరికి తెలిసే ఉంటుంది. తన బ్యాట్ తో ఎంతో మంది బౌలర్లకు చుక్కలు చూపించిన క్రిస్ గేల్ ఇక ఆటకు దూరమయ్యేడు అనుకుంటున్న సమయంలో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మొత్తంగా తన ఆటతో క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. గత ఏడాది వరకు బెంగుళూరు జట్టులో ఉన్న గేల్ 38 ఏళ్లు వచ్చాయని అతన్ని దూరం పెట్టారు. ఐపీఎల్ వేలంలో కూడా అతన్ని ఎవరు తీసుకోలేదు. అయితే ఫైనల్ గా అమ్ముడుపోని ఆటగాళ్లను వేలం వేయగా పంజాబ్ అతన్ని 2 కోట్లకు దక్కించుకుంది.

అయితే మొదటి రెండు మ్యాచ్ లో అవకాశం దక్కని గేల్ కు నిన్న జరిగిన మ్యాచ్ లో అవకాశం వచ్చింది. చెన్నైబౌలర్లకు తన సత్తా ఏంటో చూపించాడు. 33 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సులు కొట్టి 63 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 197 పరుగులు చేసింది. అయితే చెన్నై మాత్రం ఆ ఛేదనలో సక్సెస్ అవ్వలేదు. 198 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగి 193 పరుగులు మాత్రమే చేసింది. టాప్ ఆర్డర్ లో రాయుడు 49 పరుగులతో రాణించగా కెప్టెన్ ధోని 44 బంతుల్లో (6 ఫోర్లు, 5 సిక్సులు) 79 పరుగులు చేశాడు. కానీ పంజాబ్ నే విజయం వరించింది. ఈ గెలుపుతో అశ్విన్ సేన ఐపీఎల్ లో రెండు విజయాలను నమోదు చేసుకొని పాయింట్స్ పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది.