క్వాలిఫైయర్ మ్యాచ్ లో గేల్ సంచలన రికార్డ్!

Wednesday, March 7th, 2018, 05:20:32 PM IST

వెస్టిండీస్‌ విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ గత కొద్దికాలంగా సరైన ఫామ్ లేక సతమవుతున్నాడు. అంతే కాదు అతను అంతర్జాతీయ క్రికెట్ లో నే కాదు, దేశవాళీ క్రికెట్ అయిన ఐపీఎల్ వంటి మ్యాచ్ లలో కూడా ఫామ్ లో లేకపోవడం తో అతడిని మొన్న ఐపీఎల్ వేలంలో ఎవరు కొనడానికి పెద్దగా ముందుకు రాలేదు.అందుకే అతడిని కేవలం రెండుకోట్ల రూపాయలకు పంజాబ్ జట్టు దక్కించుకుంది. అయితే ప్రస్తుతం ఈ ఆటగాడు ఒక అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో సచిన్‌, ఆమ్లాల తర్వాత 11 విభిన్న దేశాలపై శతకాలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ మ్యాచ్ లలో భాగంగా మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో తన బాటింగ్ విశ్వరూపంతో చెలరేగి ఆడిన గేల్‌ 91 బంతుల్లో 123 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో మొత్తం 11 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విండీస్‌ 60 పరుగుల తేడాతో గెలిచింది. కాగా మొదట విండీస్‌ 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోరు సాధించింది. గేల్‌తో పాటు హెటీమర్‌ 127 పరుగులతో చెలరేగాడు. అనంతరం యూఏఈ 50 ఓవర్లలో 6 వికెట్లకు 297 పరుగులు చేసింది….