షాకింగ్ న్యూస్ : ఇయర్ ఫోన్స్ పేలి యువతి మృతి

Thursday, February 22nd, 2018, 12:30:01 PM IST

ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ యుగంలో ప్రతిఒక్కరి వద్ద మొబైల్ తప్పనిసరి అవసరం అయింది. అంతే కాక యువత ఈ మధ్య చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని పాటలు వింటూ, ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ కొన్ని దుర్ఘటనలు బారిన పడటం చూస్తున్నాం. అయితే నిన్న బ్రెజిల్ లో జరిగిన ఒక విషయం ఇయర్ ఫోన్స్ వాడుతున్న వారిలో ఒకింత భయాన్ని, వారి వెన్నులో వణుకు పుట్టించక తప్పదేమో అనిపిస్తుంది. బ్రెజిల్లోని రియాస్ ఫ్రియోకి చెందిన పదిహేడేళ్ల వయసుగల లూయిసా పిన్హిరో తన ఫోన్ ని ఛార్జింగ్ లో పెట్టింది. అయితే ఛార్జింగ్ లో వున్న ఫోన్ కి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాడుతున్న ఆమె ఎలక్ట్రిక్ షాక్ వల్ల వున్నట్లుండి కుప్పకూలింది.

ఆమె అపస్మారక స్థితిలో పడివున్న పరిస్థితిని గమనించిన బాలిక అమ్మమ్మ వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాధిత యువతి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భారీ విద్యుత్‌ షాక్‌ వల్లే ఆమె చనిపోయిందని, ఎలక్ట్రిక్‌షాక్‌ తగిలిన గంట తరువాత అపస్మారక స్థితిలో ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారనీ వైద్యులు తెలిపారు. ఇయర్ ఫోన్స్‌ పేలి చెవుల్లో కరిగిపోయినట్లు ఆస్పత్రి అధికార ప్రతినిధి వెల్లడించారు. కాగా ఛార్జ్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ లేదా టాబ్‌లను వాడొద్దని అనేక ఫోన్ కంపెనీలు హెచ‍్చరిస్తునే ఉన్నాయి. అంతేకాదు చార్జింగ్‌లో ఉన్నపుడు ఫోన్‌ను వినియోగిస్తే చార్జింగ్‌ వేగం తగ్గుతుందని ఇటువంటి కనీస విషయాలను ప్రతిఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు….