ప్రియుడితో తన భార్యనే హత్య చేయించిన ప్రియురాలు…

Wednesday, November 14th, 2018, 04:30:32 PM IST

చట్టానికి విరుద్ధంగా వివాహమైన వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న ఓ మహిళ అతడిని రహస్యంగా పెళ్లి చేసుకోవడమే కాకుండా, అతడి సాయంతో తన మొదటి భార్యనే హత్య చేయించిన ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌‌లో చోటుచేసుకుంది. గురుగ్రామ్ వ్యాలీ వ్యూ ఎస్టేట్‌ అపార్ట్‌మెంట్‌లో విక్రమ్ సింగ్ చౌహాన్, దీపిక దంపతులు నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతంలో ఉండే షెఫాలీ భాసిన్ తివారీ అనే మహిళతో విక్రమ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వారి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. దీంతో ఆరు నెలల కిందట వీరు రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ సంబంధం గురించి దీపికకు తెలియడంతో భర్తను నిలదీసింది. దీనిపై భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో దీపిక తనతో గొడవపడిన విషయం గురించి షెఫాలీకి విక్రమ్ తెలియజేశాడు. విక్రమ్ మెసేజ్‌కు వెంటనే స్పందించిన షెఫాలీ, దీపికను భవనం మీద నుంచి కిందికి తోసేయాలని సలహా ఇచ్చింది. ఆమె సలహా నచ్చడంతో ముందువెనుక ఆలోచించకుండా దీపికను 8వ అంతస్తు నుంచి విక్రమ్ తోసేశాడు. అక్టోబరు 27న జరిగిన ఈ ఘటనలో దీపిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం దీపిక ప్రమాదవశాత్తూ బిల్డింగ్ నుంచి పడిపోయిందని పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు. అయితే, విక్రమ్ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం రావడంతో అతడి మొబైల్ పరిశీలించగా అసలు విషయం వెలుగుచూసింది. షెఫాలీతో కలసి దీపిక హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. దీంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బ్యాంకు ఉద్యోగినిగా పనిచేసే నైనిటాల్‌కు చెందిన దీపికతో ఎనిమిదేళ్ల కిందటే విక్రమ్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గతేడాది నవంబరు నుంచి ప్రేమలో ఉన్న విక్రమ్, షెఫాలీలు దీపికను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించారు. జీమెయిల్‌లో ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఖాతా తెరిచి దాని ద్వారా రహస్యంగా చాట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కొద్ది నెలల కిందటే దీపిక హత్యకు కుట్ర పన్నినట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆమెకు విడాకులు ఇవ్వాలని లేదా చంపేయాలని విక్రమ్‌పై షెఫాలీ వత్తిడి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా హత్య జరగడానికి రెండు రోజుల ముందు దీపికను నైనిటాల్ తీసుకెళ్లాడు. అక్టోబరు 24న అక్కడే ఆమె హత్యకు పథకం వేసినా అది కుదరకపోవడంతో తిరిగి గురుగ్రామ్ వచ్చేశాడు. దీంతో విక్రమ్‌పై షెఫాలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అక్రమ సంబంధం గురించి దీపిక మరోసారి నిలదీయడంతో దీన్ని అనుకూలంగా తీసుకుని భార్యను ఎనిమిదో అంతస్తు నుంచి కిందకు తోసేసి హత్య చేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments