గర్ల్ ఫ్రెండ్ కోసం దొంగగా మారిన సాఫ్ట్ వెర్ ఉద్యోగి…

Thursday, November 8th, 2018, 10:40:27 PM IST

తనకొచ్చే జీతం డబ్బులు, వారి ఖర్చులకి సరిపోకపోవడంతో, గర్ల్ ఫ్రెండ్ ఖర్చుల కోసం సెర్చ్‌ఇంజన్‌ దిగ్గజం గూగుల్‌లో ఇంజనీర్‌గా పనిచేసే గర్విత్‌ సాహ్ని అనే యువకుడు చోరీకి పాల్పడ్డాడు. హర్యానాలోని అంబాలా జిల్లాకు చెందిన సాహ్ని గత నెల 11న ఢిల్లీలోని తాజ్‌ప్యాలెస్‌లో ఐబీఎం నిర్వహించిన ఓ సెమినార్‌లో పాల్గొన్నాడు. ఈ సమావేశానికి హాజరైన దేవయాని జైన్‌ తన హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ10,000లు గల్లంతయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు హోటల్‌ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా, ఆహ్వానితుల జాబితా ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

నిందితుడు క్యాబ్‌లో వచ్చినట్టు హోటల్‌ బయట ఏర్పాటైన కెమెరాల్లో రికార్డైంది. క్యాబ్‌ రిజిస్ర్టేషన్‌ నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌ల ద్వారా క్యాబ్‌ను ఎవరు బుక్‌ చేశారనేది పోలీసులు ఆరా తీశారు. నిందితుడు ఫోన్‌ స్విచాఫ్‌ చేయగా, కొత్త మొబైల్‌ నెంబర్‌ను గుర్తించిన పోలీసులు అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో గర్ల్‌ఫ్రెండ్‌ ఖర్చులు భరించేందుకే తాను దొంగతనానికి పాల్పడ్డానని పోలీసుల విచారణలో నిందితుడు పేర్కొన్నాడు. చోరీ సొమ్ములో రూ 3000ను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.