గ్రీన్ కార్డు పెండింగ్ లకు ఇకపై స్వస్తి : ట్రంప్

Friday, February 9th, 2018, 09:42:19 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అవలంబిస్తున్న విధానాలు, నూతన పోకడలు ప్రధమంగా అక్కడి పౌరులకు, అమెరికా ఆర్ధిక వ్యవస్థ కు మరింత లబ్ది చేకూరే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. తాజాగా ఆయన వలస వీసా విధానాలపై మరొక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రతిపాదిస్తున్న వలస విధానంతో గ్రీన్‌కార్డుల పెండింగ్‌ దారులు సంఖ్య తగ్గించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌ నుండి వార్తలు వస్తున్నాయి. లాటరీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి కేవలం ప్రతిభ ఆధారంగా వీసాలు జారీచేయాలని తద్వారా నైపుణ్యం గల ఉద్యోగుల గ్రీన్‌ కార్డుల దరఖాస్తులు పెండింగ్‌ చాలా వరకు తగ్గిపోయే అవకాశముందని సమాచారం.

అయితే గ్రీన్‌ కార్డుల విషయంలో ఒక్కో దేశానికి ఇచ్చే కోటాను పూర్తిగా రద్దు చేయాలని భారతీయ హెచ్‌1బీ వీసాదారులు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో వైట్‌హౌస్‌ నుండి ఈ ప్రకటన వచ్చిందని సమాచారం. హెచ్‌1బీ వీసాల ద్వారా అమెరికాకు వెళ్లిన చాలా మంది భారతీయ అమెరికన్లు గ్రీన్‌ కార్డుల విషయంలో దేశాల వారీ కోటా కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. లక్షలాది మంది భారతీయ అమెరికన్ల గ్రీన్‌కార్డు దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోతున్నాయి.

అయితే అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పలురకాల వీసాలపై వచ్చి ఉద్యోగాలు చేస్తున్నభారతీయుల్లో కొందరు వాషింగ్టన్‌లో గత వారం రోజులుగా వలస విధానాల్లో మార్పు తీసుకురావాలని ట్రంప్‌ను, అక్కడి అమెరికన్ కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ ప్రస్తుత వలస విధానానికి స్వస్తి పలకడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న నష్టాన్ని నివారించనున్నామని వైట్‌హౌస్‌ ఈ నేపథ్యంలో ప్రకటించింది. దీనిపై ట్రంప్‌ కూడా ట్విటర్‌ ద్వారా స్పందించి, లాటరీ విధానాన్ని రద్దు చేసే సమయం వచ్చింది, కాంగ్రెస్‌కు మేలైన వలస విధానాన్ని రూపొందించాల్సిన, అమెరికన్లను కాపాడాల్సిన అవసరముందని ట్వీట్‌ చేశారు. ఈ విధమైన ప్రతిభ ఆధారిత వలసల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రతిభావంతులు అమెరికా వచ్చేందుకు ఆకర్షితులవుతారని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది…..

  •  
  •  
  •  
  •  

Comments