జేసీ బ్ర‌ద‌ర్స్ వ‌ర్సెస్ జేడీ బ్ర‌ద‌ర్స్‌!!

Thursday, January 19th, 2017, 12:25:48 AM IST

jc-brothers
అనంత‌పురం రాజ‌కీయాల్లో జేసీ బ్ర‌ద‌ర్స్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఈ ఇద్ద‌రూ ద‌శాబ్ధాలుగా రాజ‌కీయాల్ని అట్టుడికిస్తూ త‌మ‌దైన శైలిలో చ‌క్రం తిప్పుతున్నారు. అలాంటిది ఈ ఇద్ద‌రినీ కొట్టే మ‌రో ఇద్ద‌రు బ‌రిలోకి దిగ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ద‌శాబ్ధాల జేసీ బ్ర‌ద‌ర్స్ కి తాడిప‌త్రి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి సోద‌రుల రూపంలో సిస‌లైన ప్ర‌త్య‌ర్థులు త‌గిలారు. ఈ ఇద్ద‌రినీ ప్ర‌శ్నించే ఆ ఇద్ద‌రూ త‌గిలారంటూ మాట్లాడుకుంటున్నారు.

అంతెందుకు జేసీ సోద‌రుడు ప్ర‌భాక‌ర్ రెడ్డి అనుచ‌రుడు ర‌వీంద్ర అవినీతిపై ఏకంగా క‌ర‌ప‌త్రాల్నే ముద్రించి పంపిణీ చేయ‌డం అనంత‌పురంలో క‌ల‌క‌లం రేపింది. ద‌మ్ముంటే తాడిప‌త్రిలో జేసీ, అత‌డి అనుచ‌రులు చేస్తున్న అవినీతిపై చ‌ర్చ‌కు రావాల్సిందిగా జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి (జేడీ) వ‌ర్గం స‌వాల్ చేయ‌డం కాక‌లు పుట్టిస్తోంది. వాస్త‌వంగా తాడిప‌త్రి రాజ‌కీయాల్లో జేసీ బ్ర‌ద‌ర్స్ వేలు పెట్ట‌డం జేడీ బ్ర‌ద‌ర్స్‌కి ప‌ద‌వులు ద‌క్క‌కుండా చేయ‌డం ఇందుకు కార‌ణ‌మైంది. జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మ‌న్ కాకుండా అడ్డుకున్న‌ది జేసీ బ్ర‌ద‌ర్స్‌. మున్సిప‌ల్ కౌన్సిల్ స‌మావేశాల్లోనూ జేడీపై జేసీ ప్ర‌భాక‌ర్ దాడి చేయ‌డం ప‌గ‌లు-ప్ర‌తీకారాల్ని పెంచింది. ఆ క్ర‌మంలోనే జేసీలంటే జేడీ బ్ర‌ద‌ర్స్‌కి మంట‌. దీంతో తేదేపాలో వ‌ర్గ పోరు గురించి ఇప్పుడు అనంత రాజ‌కీయాల్లో విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది.