నందమూరి నటసింహం జన్మదినం

Monday, June 10th, 2013, 10:05:42 AM IST


నందమూరి బాలకృష్ణ.. సినిమాల్లో, రాజకీయాల్లో పెను సంచలనం.. కంటి చూపుతోనే ప్రత్యర్థులను మట్టికరిపిస్తారు.. ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తూ.. తన రికార్డులను తానే బ్రేక్‌ చేస్తారు. తారకరాముని వారసునిగా నందమూరి అభిమానులు బాలయ్యా.. అని ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ బర్త్‌ డే ఈ రోజు. 54వ వసంతంలోకి అడుగుపెడుతున్న బాలయ్యకు శుభాకాంక్షలు అందిస్తూ ఆయన సినీ కెరీర్‌ విశేషాలు మీ కోసం.

నవరసాలు పోషించి విశ్వవిఖ్యాత నవ రస నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా ఎదిగారు. తండ్రి చాటున నటనలో ఓనమాలు నేర్చుకున్న బాలకృష్ణ.. సోలో హీరోగా కెరీర్‌ మొదలుపెట్టి అదరగొట్టాడు. మంగమ్మగారి మనవడు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నాడు.

పంచ్ డైలాగ్స్‌..!
స్టార్ హీరో నటవారుసుడు సినిమాల్లో అడుగుపెడితే.. వారిపై ఉండే అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇక తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో ఆకట్టుకున్నఎన్టీఆర్ వారసుడిపై ప్రేక్షకుల్లో మరెన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా తండ్రి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ.. కొద్ది కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తనదైన నటన.. డిఫరెంట్ మాడ్యూలేషన్‌తో చెప్పే పంచ్ డైలాగ్స్‌తో ఆడియెన్స్‌ను బాగా మెప్పించాడు. కొద్దికాలంలోనే తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు.

బాలయ్య రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలే కాదు.. ప్రయోగాత్మకమైన సినిమాల్లోనూ నటించాడు. సైన్స్‌ ఫిక్షన్‌, జానపద తరహా చిత్రాల్లోనూ తనకు తిరుగులేదని నిరూపించాడు. స్టార్ హీరోలు ఎక్కువగా ప్రయోగాల జోలికి వెళ్లరు. కానీ బాలకృష్ణ మాత్రం తనకు నచ్చిన కథలో నటించేందుకు ఏ మాత్రం వెనక్కితగ్గడు. అలా ఇరవై ఏళ్ల క్రితం ఈ స్టార్ హీరో నటించిన ఆదిత్య 369.. అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలుగా నటించిన బాలకృష్ణ తన తండ్రి నటనను మరిపించాడు.

మళ్ళీ జానపదం..!
ఇక 1994లో బాలకృష్ణ నటించిన భైరవద్వీపం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జానపద చిత్రాలు ఇక తెలుగులో రావేమో అనుకున్న టైంలో వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఫీల్ అందించింది. మంచి కథ, సరికొత్త గ్రాఫిక్స్, ఆకట్టుకునే కత్తి విన్యాసాలు ఈ సినిమాను సూపర్‌ హిట్‌గా నిలిపాయి. బాలకృష్ణ కెరీర్‌లో భైరవద్వీపం సినిమాను వన్‌ ఆఫ్ ది స్పెషల్ మూవీగా చేశాయి. అప్పటి వరకు టాలీవుడ్‌లో ఒకేరకమైన యాక్షన్ సినిమాలు వచ్చాయి. ఫైట్స్ అయినా… యాక్షన్‌ అయినా… ఒకే తరహాలో ఉండేవి. అయితే బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి.. టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పంచ్ డైలాగ్స్, పవర్‌ఫుల్ యాక్షన్‌కు కేరాఫ్ అడ్రాస్‌గా నిలిచాయి ఈ స్టార్ హీరో నటించిన పలు సూపర్‌ హిట్ సినిమాలు.

టాలీవుడ్ రికార్డులు
ఇప్పుడు తెలుగులో సినిమాల్లో పవర్‌ఫుల్ డైలాగ్స్‌ ఉండాలంటే.. ఆ సినిమా కాస్త ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాల్సిందే. అలాంటి ఫ్యాక్షన్ సినిమాలో ఫుల్‌ లెంగ్త్ యాక్షన్ ప్రజెంట్ చేసిన క్రెడిగ్ బాలకృష్ణకే దక్కుతుంది. 1999లో ఈ స్టార్ హీరో నటించిన సమరసింహారెడ్డి బాలకృష్ణ పవర్‌ఫుల్ నటన ఎలాంటిదో మరోసారి ఆడియెన్స్‌కు చాటిచెప్పింది. సమరసింహారెడ్డి విడుదలైన రెండేళ్ల తరువాత వచ్చిన నరసింహనాయుడు అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఆ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ డూపర్ హిట్ అనిపించుకుంది. బాలకృష్ణ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్.. ఆడియెన్స్‌తో విజిల్స్ వేయించాయి.

ఇక రెండేళ్ల క్రితం టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సింహా సినిమా బాలకృష్ణ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. బాలకృష్ణ సినిమాలకు ఇక కాలం చెల్లినట్టే అని వినిపించిన కామెంట్స్‌కు ఈ సినిమా గట్టి సమాధానమే చెప్పింది. బోయపాటి శీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వరుస ఫ్లాపులతో టాలీవుడ్‌ కష్టకాలంలో వున్నప్పుడు సింహ హిట్‌.. ఇండస్ట్రీకే పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు.

బాలకృష్ణ నటించిన పౌరాణిక చిత్రం శ్రీరామరాజ్యం.. అలనాటి కళాఖండం లవకుశకు రీమేక్‌గా తెరకెక్కింది. భారీ వ్యయంతో సీనియర్ దర్శకుడు బాపు తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు సినీ ప్రియులకు మధురానుభూతిని అందించింది. ఇక ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో బాలకృష్ణ ఎంతో అద్భుతంగా నటించాడు.

మళ్లీ ‘సింహా’ కాంబినేషన్
ఇక తాజాగా 9 నెల‌ల సుదీర్ఘ విరామానికి స్వస్తి చెప్పిన బాలయ్య కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య కొత్త సినిమా ప్రారంభమైంది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటికే ‘సింహా’ సూపర్ హిట్ కావడంతో కొత్త సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

తనదైన నటనతో మూడు దశాబ్దాలను ప్రేక్షకులను అలరిస్తున్న బాలయ్య వంద సినిమాలకు సమీపంలో ఉన్నారు. మరోవైపు ఆదిత్య 369 సీక్వెల్‌తో పాటు, భట్టి విక్రమార్క రీమేక్‌లో బాలకృష్ణ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.