హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్…. ‘మహర్షి’ గా రానున్న మహేష్ బాబు!

Thursday, August 9th, 2018, 07:47:18 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, తండ్రి కృష్ణ గారి నటవారసత్వంతో చిన్నప్పుడే నీడ చిత్రంతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసారు. అక్కడినుండి పలు చిత్రాల్లో నటించి ఆ వయసులోనే అందరిని మెప్పించిన మహేష్ బాబు, రాజకుమారుడు చిత్రంతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రం సూపర్ హిట్ కావడంతో మహేష్ కి మొదటిలోనే మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అయితే ఆ తరువాత అయన నటించిన నాలుగవ చిత్రం ‘మురారి’ మహేష్ లోని అద్భుత నటుడిని బయటకు తీసింది. ఆ తరువాత ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్ , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను. ఇలా కెరీర్ లో సూపర్ హిట్స్ తో తన తండ్రి కృష్ణగారిలానే సూపర్ స్టార్ స్టేటస్ ని ఎంతో శ్రమించి పొందగలిగారు మహేష్ బాబు.

అయన తన మూడవ చిత్రం వంశీలో హీరోయిన్ గా నటించిన నమ్రత శిరోద్కర్ ను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. ఆయనకు ఒక కుమారుడు గౌతమ్ కృష్ణ, మరియు ఒక కుమార్తె సితార అనే విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన తన కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రాన్ని ఇటీవల ఊపిరి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మొదలెట్టారు. దిల్ రాజు, అశ్విని దత్, పివిపి లు ముగ్గురూ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఇకపోతే నేడు మహేష్ బాబు జన్మదిన కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. కాగా ఈ చిత్రానికి “మహర్షి” అనే టైటిల్ నిర్ణయించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మహేష్ బాబు గడ్డం, మీసం మరియు హాఫ్ హాండ్స్ షర్ట్ లో చాలా స్టైలిష్ గా కనపడుతున్నారు.

ఇప్పటికే మహేష్ పుట్టిన రోజుకు ఐదు రోజులనుండి సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తున్న అయన అభిమానులు, నేడు ఈ పోస్టర్ విడుదల తరువాత నుండి వారి ఉత్సాహాన్ని మరింత పెంచారు. ఇక నేడు మహేష్ బాబు పేరుతో #HappybirthdaySuperstarMahesh హాష్ ట్యాగ్ ను వారు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. సో నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ కి బర్త్ డే విషెస్ చెపుతూ, తన కెరీర్ లో 25వ చిత్రంగా రానున్న ఈ మహర్షి చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం….

  •  
  •  
  •  
  •  

Comments