తెలంగాణ దోపిడీకే మ‌హాకూట‌మి!- హ‌రీష్‌

Sunday, October 7th, 2018, 09:00:24 PM IST

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎర‌వేసే డ‌బ్బు కోస‌మే మ‌హాకూట‌మి ఏర్ప‌డింద‌ని, తెలంగాణ‌ను దోచుకునే కూట‌మి ఇద‌ని హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గం -మంద‌ప‌ల్లిలో నిర్వ‌హించిన ఏక‌గ్రీవ తీర్మాన స‌భ‌లో హ‌రీష్ మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో తేరాస‌ను నాశ‌నం చేయాల‌ని బాబుతో కాంగ్రెస్ జ‌త‌క‌డుతోంది. ఈ కూట‌మికి ఓట్ల రూపంలోనే ప్ర‌జ‌లు బుద్ధి చెప్పాల‌ని హ‌రీష్ వ్యాఖ్యానించారు. న‌దీజ‌లాలు, ఉమ్మ‌డి ఆస్తుల పంప‌కాల విష‌యంలో చంద్ర‌బాబు ఎవ‌రికి స‌పోర్టునిస్తారో చెప్పాల‌ని, తెలంగాణ వైపు నిల‌బ‌డ‌తారా? అని హ‌రీష్ స‌వాల్ చేశారు. కాళేశ్వ‌రం ఆపేందుకు బాబు కుతంత్రాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ప్రాజెక్టులు నిలిచిపోతాయ‌ని, బ‌తుక‌మ్మ చీర‌ల పంప‌కంలో కాంగ్రెస్ ఓర్వ‌లేని త‌నం స‌హించ‌లేనిద‌ని అన్నారు. రాబోయే 60 రోజులు అందరూ పట్టుదలతో పనిచేమ‌ని హ‌రీష్ త‌మ పార్టీ నేతలకు సూచించారు.

గెలిస్తే రాబోయే ఐదేళ్లు మీకోసం పనిచేస్తానని హరీష్ హామీ ఇవ్వ‌డ‌మే గాకుండా, మహాకూటమికి తగిన గుణపాఠం చెబుతామ‌ని కూడా అన్నారు. వలసలు – ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ కావడమే టీఆర్ఎస్ ఎజెండా అని హరీష్ రావు అన్నారు. అయితే హ‌రీష్ మాట‌లు కోట‌లు దాటుతున్న వ్య‌వ‌హారంపై తేదేపాలో చ‌ర్చ‌కొచ్చింది. త‌మ‌కు ఉన్న రాజ‌కీయానుభ‌వంతో తేదేపాని ఇర‌కాటంలో పెట్ట‌డంలో హ‌రీష్, కేసీఆర్ తెలివితేట‌ల్ని ప్ర‌శంసిస్తున్నా, మ‌రోవైపు తేరాస నాయ‌కుల తీరుతెన్నుల్లో నిజాయితీ లేద‌ని, అధికారం మాటున దోపిడీ సాగిస్తున్నార‌ని ప్ర‌జ‌ల్లో మాత్రం నెగెటివ్ టాక్ వినిపిస్తోంది.