కేసీఆర్ మాస్టర్ ప్లాన్: లోక్ సభకు మిస్టర్ హరీష్ – అసెంబ్లీకి మిస్సెస్ హరీష్..?

Monday, February 11th, 2019, 01:15:55 PM IST

తెలంగాణాలో లోక్ సభ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించటం పైనే ఫోకస్ మొత్తం పెట్టారు. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన రాష్ట్రంలో పూర్తి స్థాయి క్యాబినెట్ ఇంకా ఏర్పాటు చేయలేదు, కాగా మంత్రి వర్గంలో కేటీఆర్, హరీష్ రావులకు చోటు ఉండబోదని, హరీష్ రావు ఎంపీ గా పోటీ చేయనున్నారని, జాతీయ రాజకీయాల్లో హరీష్ రావు కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉండేందుకు కేసీఆర్ ఆ రకంగా మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు.

ఆ వార్తలను బలపరుస్తూ ఇప్పుడు మరో వార్త తెలంగాణ రాజకీయవర్గాల్లో హల్ చల్ చేస్తోంది, అదేంటంటే హరీష్ రావు భార్య శ్రీమతి తన్నీరు శ్రీనిత సిద్దిపేటలో జరగబోయే ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారట. హరీష్ రావును లోక్ సభ బరిలో దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారని, ఆ స్థానానికి ఆయన సతీమణి పోటీ చేయనున్నారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు కేసీఆర్ అన్న కుమార్తె, టీపీసీసీ అధికార ప్రతినిధి రమ్యరావు కాంగ్రెస్ కు సంబందించిన వాట్సాప్ గ్రూప్ లో “తాజా తెలంగాణ” పోస్ట్ చేసారు, ఈ పోస్ట్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తల్లో నిజమెంతో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.