ఊసరవెల్లిలా రంగులు మార్చడం ఆయన నైజం : వైఎస్ జగన్

Wednesday, March 28th, 2018, 09:35:23 AM IST

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు పై కాస్త దూకుడు పెంచారు. చంద్రబాబు కుయుక్తులు ప్రజలకు తెలుసన్న ఆయన ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వాళ్ళని మోసం చేయడం ఎవరివల్ల కాదు అన్నారు. అసలు ప్రత్యేక హోదాను ఆనాడు హేళన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు అఖిలపక్షానికి దిశానిర్దేశం చేయడం దొంగే దొంగా అని అరచినట్లుగా ఉందని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ధ్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని అమరావతి బస్టాండ్‌ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ప్యాకేజీ ప్రకటించిన రోజే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు డిమాండ్‌ చేసి ఉంటే ఇప్పుడది పరిగెత్తుకుంటూ వచ్చేదన్నారు. కానీ అలా కాకుండా ప్రత్యేక ప్యాకెజీ తో కక్కుర్తిపడి తన సొంత లాభంకోసం రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టుపెట్టారని మండిపడ్డారు. హోదా విషయంలో ఊసరవెల్లికన్నా స్పీడుగా ఆయన రంగులు మారుస్తున్నారని, అది ఆయన నైజం అని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై తాము మొదటి నుంచీ పోరాడుతున్నామన్నారు. 2019 ఎన్నికల్లో ఆత్మసాక్షానుసారం ఓటేయాలని ప్రజలను ఆయన కోరారు….