వైరల్ న్యూస్ : పేస్ బుక్ స్నేహంతో లక్షలు నొక్కాడు…తరువాత ఏమయ్యాడు??

Wednesday, April 4th, 2018, 12:10:24 AM IST


ఇంటర్నెట్ మాధ్యమం వినియోగం ఎక్కువైన ప్రస్తుత కాలంకో కొందరు మోసగాళ్లు అమాయక వ్యక్తులను, అలానే ఆడవారిని సోషల్ మీడియాలో స్నేహం పేరుతో వలపన్ని మోసం చేయడం సర్వసాధారణమైంది. అందుకే కొత్తవారితో, పేస్ బుక్ అలానే ట్విట్టర్ వంటివాటితో స్నేహం మొదలుపెట్టేటపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని ఎంతమంది చెపుతున్నప్పటికీ కొందరు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ఇటీవల అటువంటిదే జరిగిన ఒక సంఘటన వింటే ఎంతటివారికైనా ఆశ్చర్యం వేయక మానదు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం రామన్న గారిపల్లెకు చెందిన ఎస్‌ లావణ్య హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది.

ఈమెకు మూడేళ్ల క్రితం ఒంగోలుకు చెందిన సురేష్‌ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం చేసుకున్నాడు. అయితే సురేష్‌ కూడా హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తుండడంతో తమ పక్క జిల్లా వ్యక్తి అని, మంచివాడని నమ్మింది. ఆ క్రమంలో సురేష్ ఒకసారి తనకు మంచి ప్రాజెక్ట్‌ వర్క్‌ వచ్చిందని, నీవు కూడా కొంత పెట్టుబడి పెడితే షేర్‌ ఇస్తానని లావణ్యకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. దీంతో అతడి మాయమాటలు నమ్మిన లావణ్య ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా పలు విడతలుగా రూ.5.62 లక్షలు సురేష్‌ ఖాతాకు జమచేసింది. అయితే సురేష్‌ తనకు లాభాలు వస్తాయని చెప్పి చాలా గడుస్తుండడంతో యేవో వంకలు చెప్పి తప్పించుకునేవాడు. అయితే లాభంతో కలిపి డబ్బు ఇవ్వకపోగా మరో కహానీ వినిపించాడు.

ఆ ప్రాజెక్ట్ వర్క్‌ విషయంలో పార్ట్ నర్ తనను మోసం చేశాడని, దీంతో తాను మోసపోయానని, మన ఇద్దరి డబ్బు కూడా పోయిందని లావణ్యకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఆ మాటలకూ షాక్ తిన్న లావణ్య ఏమీ మాట్లాడలేదు. ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న సురేష్ తన మాటలు నమ్మిందని సంతోషపడ్డాడు. ఆ తరువాత కొంతకాలం గడిచాక మళ్లీ లావణ్యకు ఫోన్‌ చేసిన సురేష్ ఈసారి తానే సొంతంగా ప్రాజెక్ట్‌ వర్క్‌ ప్రారంభిస్తున్నానని, పార్ట్ నర్ లు అంటూ ఎవరూ లేనందువల్ల మోసపోయే ఛాన్స్ లేదని ఈసారి ఖచ్చితంగా డబ్బు సంపాదించవచ్చని, పాత డబ్బులు కూడా వచ్చేస్తాయని మళ్లీ నమ్మబలకడం ప్రారంభించాడు.

అయితే ఈ సారి మాత్రం రూ.3లక్షలు పెట్టుబడి పెడితే షేర్ ఇస్తానని, వచ్చిన లాభాలు మనిద్దరం షేర్ చేసుకోవడమేనని చెప్పాడు. దీంతో సరేనని అతన్ని నమ్మించిన యువతి ఈ విషయాన్నికుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు అందరూ కలసి సురేష్ కు బుద్ది చెప్పేందుకు పక్కా ప్రణాళిక రచించి, ఆ తరువాత లావణ్యతో అతడికి ఫోన్‌ చేయించారు. తాను తొలివిడతగా రూ.50వేలు నగదు ఇస్తానని, నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండు వద్దకు రావాలని కోరింది. ఆ మాటలకు అమిత సంతోషపడ్డ సురేష్‌ హైదరాబాద్‌ నుంచి సోమవారం నెల్లూరు ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న లావణ్య, ఆమె కుటుంబ సభ్యులు కలిసి సురేష్‌ను పట్టుకుని పోలీసులకు పట్టించారు. ఆ తరువాత జరిగిన మోసం అంతా పోలీసులకు చెప్పి సురేష్ పై కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోంది…..

  •  
  •  
  •  
  •  

Comments