కొడుకు టెన్త్ ఫెయిల్ అయినందుకు పెద్ద పార్టీ ఇచ్చిన తండ్రి!

Thursday, May 17th, 2018, 01:40:10 AM IST

ఎక్కడైనా బిడ్డలు బాగా చదివి మంచి మార్కులు సాధిస్తే చుట్టుప్రక్కల వారికి విందు ఇచ్చి తల్లితండ్రులు ఎంతో ఆనందం, సంతోషంతో గడపడం చూస్తుంటాం. అయితే మధ్యప్రదేశ్ లో మాత్రం ఒక తండ్రి అందుకు భిన్నంగా కన్నకొడుకు టెన్త్ ఫెయిల్ అయిన సందర్భంగా ఇరుగుపొరుగు వారిని పిలిచి ఘనమైన పార్టీ ఇచ్చాడు. ఈ వింతను చూసి చుట్టుప్రక్కల ప్రాంతాల వారు ఆశ్చర్యపోయారు. ఇక విషయంలోకి వెళితే, భోపాల్ కు చెందిన సురేంద్ర కుమార్ వృత్తి రీత్యా కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. అతని కొడుకు ఆశు మొన్న విడుదలయిన పదవ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. అయితే ఫలితాలు చూసి కొడుకు ఆశు పై ఏమాత్రం ఆగ్రహించని సురేంద్ర, ఆలా ఫెయిల్ అయినందుకు చుట్టుప్రక్కల వారు, తెలిసిన వాళ్ళని పిలిచి స్వీట్లు పంచి, టపాసులు కాల్చి పెద్ద పార్టీ ఇచ్చాడు. అయినా ఇదేమి విడ్డూరమని చుట్టూ ప్రక్కల వారు ప్రశ్నించారు.

ఈ వింతను చూడడానికి మీడియావారు కూడా సురేంద్ర ఇంటివద్దకు చేరుకున్నారు. అయినా మీ అబ్బాయి ఫెయిల్ అయితే పార్టీ ఎందుకు ఇచ్చారు అని వారు వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ నిజానికి వాడు ఫెయిల్ అయినపుడు నాకు కోపం రాలేదు. ఎందుకంటే వాడు చదవడానికి పడ్డ కష్టం నాకు తెలుసు. అయినా పరీక్షల ఫలితాలు జీవితం కంటే ముఖ్యం కాదు. వాడు తప్పాడని ఒకవేళ నేను కోప్పడడమో, లేక కొట్టడమో చేస్తే అది వాడి మనసులో పాతుకుపోయి రేపు వాడు ఆ బాధతో ఏదైనా అఘాయిత్యానికి పూనుకుంటే నిండు నూరేళ్ళ జీవితం ఒక్కసారిగా నాశనం అవుతుంది. అందుకే ఇప్పుడు కాకపోతే మరొకసారి పాసవుతాడనే నమ్మకం నాకుంది అన్నాడు.

ఈ విషయమై కొడుకు ఆశు మాట్లాడుతూ, నేను ఫెయిల్ అయితే నాన్ను కొట్టలేదు సరికదా, కనీసం కోప్పడనుకూడా లేదు. నన్ను అర్ధం చేసుకున్న మా నాన్నకు కృతజ్ఞతలు, వచ్చే సంవత్సరం ఇంకా కష్టపడి చదివి పదవతరగతి మంచి మార్కులతో పాస్ అవుతానని అందరి సాక్షిగా తల్లితండ్రులకు మాటిచ్చాడు. సురేంద్ర కుమార్ చేసిన ఈ పనికి మీడియా సహా, అక్కడికి వచ్చిన వారందరూ తెగ మెచ్చుకుంటూ, ఆయనపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ప్రతి తల్లి, తండ్రి ఆయనలా కాస్త లోతుగా ఆలోచిస్తే పిల్లలు చదువుపేరుతో ఒత్తిడికి గురయి ఆత్మహత్యలు చేసుకోవటం వంటివి చాలా వరకు తగ్గుతాయని పలువురు అభినందిస్తున్నారు……