ఆయన చార్లెస్ శోభరాజ్ ను మించిన గజదొంగ : వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి

Tuesday, March 27th, 2018, 03:02:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టిడిపికి, వైసిపికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది అని అందరికి తెలుసు. అసలే ఎన్నికల సమయం దగ్గరపడుతోంది, అందునా ఓ వైపు టిడిపి, మరోవైపు వైసిపి ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ని విజయ్ మాల్యాతో పోల్చడం, ఆయనను ఆర్ధిక నేరగాడు అనడంతో వైసిపి నేతలు మండిపడుతున్నారు.

నేడు విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన విజయసాయిరెడ్డి నేరగాళ్లందరికీ లీడర్‌ చంద్రబాబు అని, చార్లెస్‌ శోభరాజ్‌ను మించిన గజదొంగ చంద్రబాబు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అలాగే ఆర్థిక నేరగాడు విజయ్‌మాల్యాతో నన్ను పోల్చుతారా అంటూ ప్రశ్నించారు. నేను ఇప్పటివరకు ఏ ఒక్క బ్యాంక్‌ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. అంతేగాక టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అని, రెండేళ్లు శిక్ష పడిన ఎమ్మెల్యే ఇంకా టీడీపీలో కొనసాగుతున్నారని, మీ మంత్రులు, ఎంపీలు పేకాట క్లబ్‌లను నిర్వహిస్తున్నారంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. దమ్ముంటే చంద్రబాబుకు తమ పార్టీ నేతలు చేస్తున్న అవినీతిబయటపెట్టాలని సవాల్ విసిరారు….