ఇంటిని లూటీ చేసి స్నేహితులకు లక్షలు ఇచ్చిన బుడతడు!

Wednesday, May 23rd, 2018, 04:59:15 PM IST

కొందరు పిల్లలు చిన్నతనంలో తల్లితండ్రులకు తెలియకుండా డబ్బులు తీసుకుని తమ స్నేహితులతో కలిసి వారికి కావలసినవి కొనుక్కుంటుంటారు. ఇది దాదాపుగా చాలా మంది ఇంట జరిగే తంతు. అయితే వాళ్ళు తీసుకునే డబ్బు ఏదో చిన్న మొత్తంలో ఉంటుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక బుడతడు ఒకటికాదు రెండు కాదు ఏకంగా రూ. 3.5 లక్షల రూపాయలను తన స్నేహితులకి ఇచ్చాడు. విషయం తెలుసుకున్న అతని తండ్రి ఒక్కసారిగా నిర్ఘాంతపోవలసి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే, నల్గొండ జిల్లా లక్కారంలో ఒకవ్యక్తి తన ఇద్దరు కుమారులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. కాగా పెద్ద కుమారుడు తొమ్మిదవ తరగతి చదువుతుండగా, చిన్న కుమారుడు ఆరవ తరగతి చదువుతున్నాడు. అయితే రోజూ తన వ్యాపారం నిమిత్తం జరిపిన లావాదేవీల అనంతరం వచ్చిన డబ్బును బీరువాలో భద్రపరుస్తుండేవాడు. తెల్లారి ఆ డబ్బు లెక్కచూస్తే రోజూ తాను తీసుకొస్తున్న డబ్బులో ఎంతో కొంత తగ్గుతోంది.

ఇలా మూడు నెలల నుండి జరుగుతూ ఉండడంతో, భార్యని, ఇద్దరు పిల్లలను పిలిచి ఒకరోజు డబ్బు ఎందుకుతగ్గుతోంది మీలో ఎవరు తీస్తున్నారు అని నిలదీయగా ముగ్గురూ మాకు తెలియదు అని చెప్పడంతో ఆలోచనలో పడ్డ అతను, ఒకరోజు ఎలాగైనా సరే డబ్బులు ఎవరు తీస్తున్నారో తెలుసుకోవాలి అనుకున్నాడు. కాగా ముందురోజు రాత్రి పెద్ద కుమారుడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు మరికొంత డబ్బు మాయమవడంతో చిన్నవాడి పై అనుమానము వచ్చి ఇంకొంత డబ్బులు బీరువాలో పెట్టి తాళం చెవి కూడా పక్కనే పెట్టి, బయటకు వెళ్తున్నట్లు నటించి ఇంటి ప్రక్కనే దాక్కున్నాడు. అతను బయటకు వెళ్లిన వెంటనే చిన్న కుమారుడు వచ్చి మెల్లగా తాళం తీసి అందులో కొంత డబ్బు తీసుకుని తన స్నేహితుడికి ఇస్తుండగా మొత్తం గమనించిన తండ్రి అతడిని పట్టుకున్నాడు.

ఇలా ఎన్నాళ్ళనుండి జరుగుతుంది అని నిలదీయగా దాదాపుగా మూడు నెలలనుండి అని చెప్పాడు. మరి డబ్బు ఏమి చేసావ్ అంటే, నా స్నేహితులకి ఇచ్చాను అని చెప్పాడు. విచిత్రం ఏమిటంటే ఆ పిల్లవాడి స్నేహితులు ఆ డబ్బుతో కొందరు మొబైల్ ఫోన్ లు కొనగా, ఏకంగా ఒకడు మోటార్ బైక్ కొనుగోలు చేసాడు. అయితే ఎవరికి ఎంత ఇచ్చాను అనేది తనదగ్గర లెక్క ఉందని కుమారుడు చెప్పడంతో మరుసటి రోజు గ్రామ పంచాయితీ పెద్దల దగ్గరకు వెళ్లి విషయం వివరించి, తన కుమారుడు మిగిలిన తన స్నేహితులకి ఇచ్చిన డబ్బులు లెక్కలు చెప్పి, వారి తల్లి తండ్రులను కూడా పంచాయితీకి పిలిపించాడు. కాగా ఆ బాలుడు చెప్పిన లెక్క ప్రకారం మిగిలిన వారు నిజమే అని ఒప్పుకున్నారు. కాగా మొత్తం అందరి దగ్గర రావలసిన రూ.3.5 లక్షలను పంచాయితీ పెద్దలు వారి వారి తల్లితండ్రులనుండి వసూలు చేసి అతనికి ఇప్పించారు. అంత చిన్న బుడతడు ఇలాంటి పని చేయడంతో ఆ ప్రాంతంలోని వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు…..

  •  
  •  
  •  
  •  

Comments