చంద్ర‌బాబు ఒక్క‌రోజు దీక్ష‌.. ప్ర‌జాసొమ్ము ఎన్ని కోట్లంటే..?

Monday, February 11th, 2019, 11:19:22 AM IST

ఎవరైనా నేతలు దీక్షలు, నిరసనలు చేస్తే ప్రజలకు ప్రయోజనం కలగడం చూశాం. కానీ సిఎం చంద్రబాబు నాయుడుగారు దీక్ష చేస్తే మాత్రం రాష్ట్ర ఖజానాకు గూబ గుయ్యిమంటోంది. ఏపీలో పలుచోట్ల ధర్మపోరాట దీక్షల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మంచి నీళ్లలా ఖర్చు చేసిన టీడీపీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో మోడీ ప్రభుత్వాన్ని విభజన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న ఒక్కరోజు దీక్ష కోసం భారీ స్థాయిలో ప్రజల సొమ్మును వాడేస్తోంది.

ఈ దీక్షకు ప్రభుత్వ అగ్ర నేతలతో పాటు వివిధ సంఘాల ముఖ్య నేతలు హాజరవుతున్నారు. వారందరి కోసం సుమారు 150 విమాన టికెట్లు, బస కోసం ఢిల్లీలో ఉన్న స్టార్ హోటళ్లలో ఖరీదైన ఏసీ రూములు, వివిధ అతిథి గృహాల్లో రూములు బుక్కయ్యాయట. ఇక శ్రీకాకుళం, అనంతపురం నుండి ఏర్పాటు చేసిన స్పెషల్ రైళ్లలో వెళ్లినవారి ప్రయాణ, భోజన, వసతి ఖర్చులు కూడా ప్రజా ధనం నుండే వెచ్చిస్తున్నారు.

సభా స్థలికి వీరందరినీ తరలించడానికి ఏర్పాటు చేసిన 32 బస్సులు ఏర్పాటు చేశారు. ఇక సిఎం దీక్షకు కూర్చోబోయే సభాస్థలికి, దీక్ష ప్రచారం కోసం తయారుచేసిన హోర్డింగుల ఖర్చు 80 లక్షల వరకు ఉండొచ్చు. మొత్తంగా ఈరోజు ఢిల్లీలో మనవాళ్ళు చేసే హడావుడి ఖర్చు 10 కోట్ల పైమాటే. ఈ ఖర్చు గురించి ఎల్లో మీడియా మాట్లాడుతూ జనం కోసం చేస్తున్న దీక్షకు పెడుతున్న ఖర్చే కదా అని బుకాయిస్తోంది. మరి జనం కోసమే అనుకున్నపుడు రాసుకున్న నిబంధనలను సడలించి పార్టీ ఫండ్ నుంచో లేకపోతే వివిధ రకాలుగా ప్రభుత్వం నుండి ప్రయోజనాలు పొందిన నేతలు వెనకేసిన కోట్ల నుంచో తీసి పెట్టొచ్చు కదా.. అసలే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.