అలెర్ట్ : ఏపి, తెలంగాణలో భారీ వర్ష సూచన!

Friday, September 7th, 2018, 10:06:41 AM IST

ఈ ఏడాది వర్షాకాలం కారణంగా కొన్ని ప్రాంతాలకు తిప్పలు తప్పేలా లేవు. ఇప్పటికే కేరళ కర్ణాటక అలాగే ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వర్షాలు జనాలను ఇబ్బందులకు గురి చేశాయి. ఇక ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు బాగానే పడనున్నాయని తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఇప్పటివరకు పడిన వర్షాలకంటే ఎక్కువ స్థాయిలో వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి సమాచారం అందుతోంది. అందుకు కారణం పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు సమీపంలో బంగాళాఖాతంలో తీవ్రమైన వాయుగుండం ఏర్పడటమే.

జెంషెడ్ పూర్ కు ఆగ్నేయంగా దాదాపు 140 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. అందువల్ల ఉత్తర కోస్తాతో పాటు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో వానలు అధికంగా కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇకపోతే కొన్ని గంటల్లో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మొన్నటి వరకు హైదరాబాద్ భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. దానికి తోడు ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ముందు జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇకపోతే మత్య్స కారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

  •  
  •  
  •  
  •  

Comments