రానున్న రోజుల్లో భారీ వర్షాలు..వాతావరణ శాఖ హెచ్చరిక!

Monday, July 9th, 2018, 08:54:34 AM IST

ఈ సంవత్సరం వర్షాకాలం కారణంగా కొన్ని ప్రాంతాలకు తిప్పలు తప్పేలా లేవు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్షాలు బాగానే పడనున్నాయని తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఇప్పటివరకు పడిన వర్షాలకంటే ఎక్కువ స్థాయిలో వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. దానికి తోడు ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక నేడు రేపు కూడా వర్షాలు పడనున్నాయని హెచ్చరికలు అందుతున్నాయి. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందువల్ల భూపాలపల్లి సూర్యాపేట వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు నగర వాతావరణ కేంద్రం వివరణ ఇచ్చింది. ఇక వచ్చే రెండు రోజుల్లో కూడా రైతులకు ఆనందాన్ని కలిగించేలా వర్షాలు పడతాయని తెలుస్తోంది. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, కొమురం భీం, పెద్దపల్లి, మంచిర్యాలలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం ఇచ్చారు. ఇక నగరంలో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments