సమీక్ష : హలో గురు ప్రేమకోసమే

Thursday, October 18th, 2018, 02:16:01 PM IST

గత కొంత కాలంగా హీరో రామ్ మరియు అనుపమ పరమేశ్వరన్ లకు సరైన హిట్ లేక సతమతమవుతున్నారు.అదే సందర్భంలో సినిమా చూపిస్త మావ,నేను లోకల్ వంటి వరుస విజయాలతో దర్శకుడు త్రినాథరావు నక్కిన దూసుకెళ్ళిపోతున్నారు.ఇప్పుడు వీరి ముగ్గురి కంబినేషన్లో దసరా కానుకగా వచ్చినటువంటి చిత్రం “హలో గురు ప్రేమ కోసమే” ఇప్పుడు ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించగలిగిందా లేదా ఇప్పుడు చూద్దాం.

కథ :

హీరో రామ్(సంజు) కాకినాడలో సరదాగా అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు.తన కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు హైదరాబాద్ లో సెటిల్ అవ్వడానికి వస్తాడు.తన తల్లి(సితార) కోరిక మేరకు రామ్, విశ్వనాద్(ప్రకాష్ రాజ్) ఇంట్లో ఉంటాడు. అదే క్రమంలో ప్రకాష్ రాజ్ కూతురు అయినటువంటి అనుపమని ప్రేమించడం మొదలు పెడతాడు. రామ్ యొక్క ప్రేమను అనుపమ అంగీకరించిందా? ఆమె తండ్రి ప్రకాష్ రాజ్ కు రామ్ కు ఎదురైన పరిస్థితులు ఏమిటి?రామ్ వాటిని దాటగలిగాడా అన్నది తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ చిత్ర దర్శకుడు త్రినాధరావు నక్కిన యొక్క ముందు చిత్రాలను చూసుకుంటే ప్రధానంగా మావయ్య-అల్లుడు ల మధ్య జరిగే సంభాషణలు,సన్నివేశాల మీద ఎక్కువ దృష్టి పెట్టి వాటికి హాస్యాన్ని జోడించి తనదైన శైలిలో తెరకెక్కిస్తాడని మళ్ళీ ఈ చిత్రంతో కూడా నిరూపించుకున్నారు.ఆయన తీసుకున్న కథాంశం పాతది అయినా దాన్ని కొత్తగా కొత్తగా తెరకెక్కించడంలో మాత్రం సక్సెస్ అయ్యారనే చెప్పాలి.హీరో రామ్ కథకు తగ్గట్టుగా ఎప్పటిలానే మంచి నటనతోను కామెడీ టైమింగ్ తోను ఆకట్టుకున్నారు.ప్రకాష్ రాజ్,రామ్ లకు మధ్య సన్నివేశాలు,మొదటి నుంచి హాస్య సన్నివేశాలు ఉండటంతో ఫస్టాఫ్ అంతా బోర్ కొట్టకుండా సాగిపోయింది.

హీరోయిన్ అనుపమ ఎప్పటిలానే తనదైన నటనతోను చక్కటి హావభావాలతోను ఆకట్టుకుంది.ఇక రెండో హీరోయిన్ అయినటువంటి ప్రణీత తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది.ఇక ప్రకాష్ రాజ్ ఒక బాధ్యత గల తండ్రిగా మళ్ళీ మెప్పించారు.ముఖ్యంగా రామ్ మరియు ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.దేవిశ్రీ పాటల వరకు మంచి సంగీతాన్ని ఇచ్చినా బాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అంతలా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

ఆధ్యంతం ఆహ్లాదంగా సాగిపోయే కథ
రామ్-ప్రకాష్ రాజ్ ల మధ్య సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథ
బాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా మెప్పించలేదు

తీర్పు:

మొత్తానికి చిత్రం మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా తియ్యడంలో త్రినాథరావు నక్కిన విజయం సాధించడంతో ఎప్పటి నుంచో హిట్ లేనటువంటి రామ్ మరియు అనుపమ పరమేశ్వరన్ లకు హిట్ తగిలిందనే చెప్పాలి.చివరిగా దసరాకు వచ్చిన వీరి చిత్ర యూనిట్ కి మరో మంచి విజయం అందిందని చెప్పాలి.

Rating : 3.5/5

  •  
  •  
  •  
  •  

Comments