కొడుకు నల్లగా ఉన్నాడని.. తల్లి ఏమి చేసిందంటే!

Monday, April 2nd, 2018, 11:30:12 PM IST


నేడు ప్రతిఒక్కరు శరీరం మీద తెగ దృష్టి పెడుతున్నారు. సన్నగా సైజు జీరో లో ఉండాలని, అలానే అందంగా తెల్లగా మెరిసిపోవాలని రకరకాల ప్రయత్నాలు చేయడం చూస్తుంటాం. అయితే ఒక తల్లి నల్లగా వున్న తన కొడుకుని తెల్లగా మార్చడానికి ఏమి చేసిందో తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు. విషయం లోకి వెళితే
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ తల్లి నల్లగా ఉన్న తన కొడుకును తెల్లగా మార్చేందుకు రాయితో రుద్దింది. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.పిల్లాడిని గాయపర్చినందుకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నిషత్‌పూర్‌లో నివాసం ఉండే సుధాతివారీ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఆమె భర్త ప్రైవేట్ ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో సుధా తివారి ఏడాది క్రితం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని మాతృచ్చాయ ఆశ్రమం నుండి ఓ బాలుడిని దత్తత తీసుకుంది. స్వతహాగా తెల్లగా, అందంగా ఉండేవారిని ఇష్టపడే సుధాతివారి, దత్తత తీసుకొన్న బాలుడు నల్లగా ఉన్నాడని ఆమె అత్త అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పిల్లాడు తెల్లగా కావడానికి ఆమె అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది.

కానీ, ఫలితం లేకపోయింది. చివరకు రాయితో రుద్దితే పిల్లాడు తెల్లగా అవుతాడని సుధాకు ఎవరో సలహ ఇచ్చారు. ఈ సలహ విని ఆమె పిల్లాడిని ఒక రాయితో అదేపనిగా శరీరం మొత్తంరుద్దింది. దీంతో చిన్నారి ఛాతీ, భుజం, వీపు, కాళ్ళ మీద తీవ్ర గాయాలయ్యాయి. సుధా సోదరి కూతురైన శోభనశర్మ ఈ విషయమై ఆమెను వారించారు. అయినా సుధా మాత్రం వినలేదు. దీంతో శోభనశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం నాడు బాలల సంరక్షణాధికారులు, పోలీసులు సుధ ఇంటి నుండి బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆ బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడిని హింసించినందుకు గాను సుధాతివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై సుధా తీరును ఆ ప్రాంతవాసులు పలువురు తప్ప్పు పడుతున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments