ఒకవైపు పదవులు, మరోవైపు టికెట్లు.. ఇది తెరాస పరిస్థితి !

Monday, February 11th, 2019, 09:30:11 AM IST


ఏపీలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతుంటే తెలంగాణలో పదవుల, టికెట్ల పంపకాల వ్యవహారం జోరుగా నడుస్తోంది. 16 మందికి స్థానం ఉన్న మంత్రివర్గంలో చోటు సంపాదించడం కోసం గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది తహతహలాడుతున్నారు. ఎవరికీ వారు పైరవీలు నడుపుతున్నారు. కేసీఆర్, కేటీఆర్.. ఎవరో ఒకరి అనుగ్రహం దక్కించుకుని మంత్రి పదవి పొందాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆశావహులంతా ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇక త్వరలో ఖాళీ కానున్న 16 ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఎక్కువమందే పోటీ ఉన్నారు. మరోవైపు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో టికెట్ సంపాదించేందుకు నాయకులంతా నానా రకాల పాట్లు పడుతున్నారు. ఏదో రకంగా కేసిఆర్ దృష్టిలో పడాలని కోరుకుంటున్నారు. ఇక నామినేటెడ్ పదవులు ఎలాగూ ఉండనే ఉన్నాయి. అవి దక్కినా సంతోషమే అనుకునే వారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. నేతలంతా ఇలా పదవుల కోసం, టికెట్ల కోసం తపించిపోతుంటే కేసీఆర్ మాత్రం సొంత లెక్కలు వేసుకుంటూ జాబితాల్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన జాబితాలో ఉన్న వ్యక్తుల పేర్లు బయటకురాకపోవడం గమనార్హం.