హైలైట్స్ : పవన్ జనసేన ఆవిర్భావ సభ!

Wednesday, March 14th, 2018, 11:02:04 PM IST

జనసేన పార్టీ స్థాపించి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నేడు గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా వున్న ప్రాంగణం లో ఆ పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. ముందుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి యెనలేని సేవలు అందించిన పలువురు ప్రముఖులను స్మరించుకుంటూ సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. నాకు మీ సేవ చేయడం ఇష్టం. మీ తరఫున పోరాడటం ఇష్టం. మీకు అండగా నిలబడటం ఇష్టం. ప్రజల్ని వంచించి, మోసం చేసి మభ్యపెట్టి వాళ్లంతా పబ్బం గడుపుకొంటుంటే ప్రజల పక్షాన నిలబడి మీ ఇంట్లో వాడిగా, అన్నగా, తమ్ముడిగా మీకెంత బాధ ఉంటుందో, ఆవేశం ఉంటుందో అదే ఆవేశంతో పార్టీ పెట్టా. నాలుగేళ్లు అయింది.

రాజకీయాల్లోకి వెళ్లే ముందు ప్రత్యేక హోదా గురించి, భారత ప్రభుత్వం, ఆర్థికమంత్రి జైట్లీ మాట్లాడిన దానికి ఒక్కసారి ఆయనకు అర్థమయ్యే విధంగా ఆంగ్లంలో మాట్లాడుతా అన్నారు . కేంద్రం అంటే మనవాళ్లకు భయం, పిరికితనం. దోపిడీచేసేవారికి పిరికితనం ఉంటుంది. మనకెందుకు భయం. టంగుటూరి ప్రకాశం పంతులు వారసులం మనం, మనకెందుకు భయం. సైమన్‌ కమిషన్‌ వస్తే చొక్కా విప్పి కాల్చిపారేయమన్నారు. మనకెందుకు భయం, అరుణ్‌ జైట్లీగారూ నాలుగేళ్లుగా ప్రజలకు మీరు చేసిన అన్యాయం మమ్మల్ని రగిలిస్తోంది, వేధిస్తోంది అని ఉద్వేగంగా అన్నారు. సెంటిమెంట్‌తో ప్రత్యేక హోదా రాదన్నారు. మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మీరెలా మద్దతు పలికారు. విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ బిజెపి పార్టీనే ప్రత్యేక హోదా ఇస్తాననలేదా. 1997లో కాకినాడలో ఒక సీటు రెండు రాష్ట్రాలు అని భాజపా చెప్పింది.

ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్‌లో హామీ ఇచ్చి తప్పుతారా చెప్పండి. మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోనప్పుడు, మీ చట్టాలను మేమెందుకు పాటించాలి. కేంద్రం తన చేతలతో ఏపీని ఉద్యమ పథంలోకి నెట్టేసింది. రాజధాని లేకుండా తెలంగాణ నుంచి మమ్మల్ని నెట్టేశారు. మేం ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో పోరాటం చేయం, ఏపీలోనే జాతీయ రహదారులపై చేస్తాం. అమరావతిలోనే, అమరావతి నుంచే దేశాన్ని ఆకర్షించేలా పోరాడతాం అన్నారు. జాతీయ రహదారులను దిగ్బంధించి మేం ఏంటో చూపిస్తాం. ఏ పరిస్థితుల్లో నేను టిడిపికి, బిజెపి నాయకులకు మద్దతు పలికాను. ప్రచారం చేశానో మీకు తెలుసు. మీతో, మీ పిల్లలతో తొక్కించుకోవడానికా మీ వెనుకకు వచ్చింది, చెప్పండి అన్నారు. ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తుంటే కంచె చేనుమేసిన చందంగా ఉంది.

నేను చంద్రబాబుకు ఎందుకంత సపోర్టు చేశానంటే ఆయన అనుభవం చూసే. నాలుగేళ్లలో టీడీపీ మాట్లాడిన మూడు మాటల్లో ఆరు అబద్ధాలు వినిపిస్తున్నాయి. తెలుగు దేశం ప్రభుత్వం అలా తయారైనందుకు బాధగా ఉంది. ఏపీ అభివృద్ధికి సామాజిక వర్గాల మధ్య ఐక్యత కోరుకున్నా. ఒకవేళ టిడిపి ఓడిపోయి యూపీఏ వచ్చి ఉంటే నన్ను ఏం చేసేవారో తెలుసా అని గట్టిగా అన్నారు. ఏపీ పునర్నిర్మాణం కోసం టిడిపికి మద్దతిచ్చా. ఆ పార్టీ పునర్నిర్మాణానికి కాదు. రాజకీయాలు చేయాలంటే దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండాలి. సీఎంను కలిసినప్పుడు రాజధాని నిర్మాణానికి 1,500 నుండి 2,000 ఎకరాలు సరిపోతాయని ఆ రోజు అన్నారు. కానీ ఇప్పుడు 33,000 ఎకరాలు కావాలి అంటున్నారు. చూస్తుంటే అభివృద్ధి కోసం టిడిపి ఏమీ చేయట్లేదనిపిస్తోంది. అయితే చంద్రబాబు తనయుడు లోకేష్ మాత్రం అవినీతి వ్యవాహారాల్లో మంచి అభివృద్ధి మాత్రం సాధిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు .

ఈ విషయం చంద్రబాబు కు తెలియకుండా వుంటుందా అని అయన అన్నారు. ఓ వైపు లోకేష్ వంటి నాయకులూ తింటుంటే మిగతా ఎమ్యెల్యే లు మంత్రులు ఊరుకుంటారా. వారు కూడా ఎవరికి దోచింది వారు తింటున్నారని ఆవేశంగా మాట్లాడారు. అయినా చంద్రబాబు చెపుతున్నట్లు, అభివృద్ధి కేవలం రాజధాని చుట్టూ కేంద్రీకృతం అయితే ఎలా. రాత్రికి రాత్రే చీకటి ఒప్పందాలు చేసుకొని ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ఏపీకి ఇచ్చిన ప్యాకేజీ బాగుందన్నారు. మళ్లీ చట్టబద్ధత కల్పించలేదన్నారు. అలానే ప్రతిపక్ష నేత జగన్ గురించి కామాట్లాడుతూ, జగన్‌ సీఎం అయితేనే అసెంబ్లీకి వెళ్తారా నేను సీఎం కాకపోయినా సమస్యలపై పోరాడటం లేదా. అని పవన్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలదీయలేకపోతోందని, అలాగే వైసీపీ నాయకులు ప్రజల తరఫున నిలబడి టీడీపీని నిలదీస్తూ బలంగా పోరాడతారా అంటే వారు అసెంబ్లీకే వెళ్లడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.

సమస్యలపై పోరాడాలంటే ముఖ్యమంత్రి కావాలా, ఈ విధానం వైసీపీ నేతలు తెలుసుకోనంత కాలం ప్రజల సమస్యలు తీర్చాలన్న లక్ష్యం నేరవేరదు అని వ్యాఖ్యానించారు. ఏపీ యువత ప్రాణాలను నేను ఫణంగా పెట్టను. నా నేల కోసం మాతృభూమి కోసం నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. టీడీపీకి ప్రజల మీద నా అంతటి ప్రేమ ఉందా. జనం మీద సాటి మనుషుల బాధలకు చలించే పోయే గుణం చంద్రబాబుకి ఉందా. అసెంబ్లీలో కూర్చొని ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. భావోద్వేగ పూరిత ప్రసంగాలు చేస్తున్నారు. గుంటూరులో కలరా వచ్చి అంతమంది చనిపోతే, మీకు భావోద్వేగం కలగలేదా. శ్రీకాకుళంలో ప్రతి ఏడాది సుమారు 55 మంది శిశు మరణాలు సంభవిస్తున్నాయి ఏం జరుగుతుందో రాజకీయ నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అని పవన్ కల్యాణ్ అటు చంద్రబాబుని, ఇటు జగన్ ను విమర్శించారు….