హిట్టా లేక ఫట్టా : ఎఫ్‌ 2 – ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్ – అన్‌లిమిటెడ్ ఫ‌న్ ఆఫ్ సంక్రాంతి

Saturday, January 12th, 2019, 07:31:02 PM IST

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంక్రాంతి బరిలో దిగిన చివ‌రి చిత్రం ఎఫ్‌-2 ఫ‌న్ అండ్ ఫ‌స్ట్రేష‌న్. వెంక‌టేష్, వ‌రుణ్‌తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌లుగా న‌టించిన విష‌యం తెలిసిందే. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మ‌రి టీజ‌ర్, ట్రైల‌ర్‌ల‌తో ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ‌కి కొత్త అళ్ళుళ్లు బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంద‌డి చేశారు.. ఇప్ప‌ట‌కే విడుద‌లైన సంక్రాంతి చిత్రాలు బోల్తా కొట్ట‌గా, ఎఫ్‌-2 మూవీ హిట్టా ఫ‌ట్టా అనేది తెలుసుకుందాం.

దర్శ‌కుడు అనిల్ రావిపూడి చిత్రాల‌న్నీ చూస్తే.. హ్యూమ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ చిత్రంలో కూడా ఎక్కువ‌గా కామెడీ పైనే ఫోక‌స్ పెట్టాడు. మొగుడు పెళ్ళాల మ‌ధ్య ఉండే గిల్లిక‌జ్జాల‌ను త‌న‌దైన విధంగా ప్రెజెంట్ చేసి స‌క్సెస్ కొట్టాడు ద‌ర్శ‌కుడు. ఎఫ్‌ 2 చాలా చిన్న క‌థ‌. సినిమా మొదలైన కొద్దిసేపటికే కథ మ‌న‌కు అర్థ‌మైపోతుంది. ట్విస్టులు, హంగుల‌ వైపు వెళ్ల‌లేదు. ట్రైలర్‌లో చూపించినట్లుగానే.. ఫ‌న్ అండ్ ఫ‌స్ట్రేష‌న్ సినిమా ఆద్యంతం కనబడుతుంది. ఎప్పుడు హ్యాపీగా ఉండే వారి లైఫ్ లోకి భార్యల రూపంలో ఫ్రస్ట్రేషన్‌ ఎంటరైతే, వారి పరిస్థితి ఏమిటి అనేదానికి అనిల్ రావిపూడి కామెడీ టచ్ ఇస్తూ తెరకెక్కించాడు. బయట జరిగే నిజమైన ఘటనలే ద‌ర్శ‌కుడు ఇలా సినిమా రూపంలో ప్రేక్షకులకు అందించాడు. నిజ జీవితంలో భార్య బాధితుల జీవితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌ లో చూస్తాం.

ఫస్ట్ హాఫ్ మొత్తం పూర్తిగా కామెడీ ప్రాధాన్యంగా సినిమాని నడిపించాడు. ప్ర‌తి సీన్‌ను న‌వ్వుల‌తో పండించాడు. ప్ర‌తి పాత్ర‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. సందర్భోచిత కామెడీ రాసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌యం సాధించాడు. ఇక‌సెకండ్ హాఫ్ కాస్త వీక్ అయినట్లుగా అనిపించినా..కామెడీ చిత్రాలలో లాజిక్స్‌కి స్పేస్‌ తక్కువ అనుకుని ఇదంతా ఓవర్‌లుక్‌ చేసేయాలి. లోపాలు వున్న మాట నిజమే అయినా వినోదం చాలా వరకు తప్పులని కవర్‌ చేసేయడంతో ఎఫ్‌ 2 ఓవరాల్‌గా వాచబుల్‌ అనిపించుకుంటుంది. ఇక వెంకీ అయితే ఈ చిత్రంలో త‌న‌దైని శైలిలో హాస్యం పండించి రెచ్చిపోయాడు, వ‌రుణ్‌తేజ్‌కి ఫుల్‌లెంత్ కామెడీ టచ్ లేక‌పోయినా ఎలాంటి బెరుకు లేకుండా బాగానే చేశాడు. భ‌ర్త‌ను ఏడిపించే భార్యగా త‌మ‌న్నా ఆకట్టుకోవ‌డ‌మే కాకుండా.. గ్లామర్ పరంగాను మోడరన్‌గా ఉంది. అలాగే మెహ‌రీన్‌కు కూడా ఒక మేన‌రిజం ఇచ్చి, ఆ పాత్ర ప్ర‌త్యేకంగా క‌నిపించేలా చేశాడు. అత్తారింటిలో వెంక‌టేష్ చూపించే ఫ్ర‌స్ట్రేష‌న్ చూసి క‌చ్చితంగా న‌వ్వుకుంటారు.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి రచయితగా దర్శకుడిగా ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. కానీ ఆయన కథ కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే సినిమా మ‌రో రేంజ్‌లో ఉండేది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని యూరప్ సన్నివేశాలన్నీ ఆయన కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సెకెండ్ హాఫ్ లో కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఇక ఫైన‌ల్‌గా చెప్పాలంటే.. సంక్రాంతికి ఎలాంటి వినోదాన్నిఅయితే ప్రేక్షకులు కోరుకుంటారో.. అలాంటి వినోదాన్ని అందించడంతో ఎఫ్‌2 మూవీ మెజారిటీ ఆడియన్స్ వ‌ద్ద మంచి మార్కులు కొట్టేస్తుంది.

123telugu.com రేటింగ్ : 3.25/5 – ఎఫ్ 2 – సింపుల్ అండ్ ఫన్నీ !

greatandhra.com రేటింగ్ : 3/5 – ఎంతో ఫన్‌

tupaki.com రేటింగ్ : 2.75/5 – సగం ఫన్.. సగం ఫ్రస్టేషన్

gulte.com రేటింగ్ : 2.75/5 ‍ కొంచెం ఫ‌స్ట్రేష‌న్.. ఎక్కువ ఫ‌న్

indiaglitz.com రేటింగ్ : 3.25/5 – ప‌క్కా కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్