హిట్టా లేక ఫట్టా :పందెంకోడి2 – మిస్ ఫైర్ అయిన జాత‌ర క‌థ‌..!

Thursday, October 18th, 2018, 07:01:54 PM IST

మాస్ హీరో విశాల్ ఈ మ‌ధ్య వ‌రుస హిట్ల‌తో మంచి ఊపుమీద ఉన్నాడు. ఇక విశాల్ కెరీర్‌నే నిల‌బెట్టిన చిత్రం పందెంకోడి. లింగుస్వామి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఆ చిత్రం తెలుగులో కూడా మంచి విజ‌యం సాధించింది. ఇక మ‌రోసారి ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం పందెకోడి-2. ఇక ఈ చిత్రంలో విశాల్ స‌ర‌స‌న హీరోయిన్‌గా కీర్తీ సురేష్ న‌టిస్తుండ‌గా.. వ‌ర‌ల‌క్ష్మీ ప్ర‌తినాయ‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇలా భారీ అంచ‌నాల‌తో విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన పందెంకోడి చిత్రం హిట్టా ఫ‌ట్టా అనేది చూద్దాం.

విశాల్ సినిమా అంటేనే బీసీ సెంట‌ర్స్‌ ప్రేక్ష‌కుల‌కు పండుగ వ‌చ్చినట్టే. ఎందుకంటే ఈ చిత్రాలు మాస్ యాక్ష‌న్‌కు కేరాఫ్ అడ్ర‌స్. దీంతో పందెకోడి2 ట్రైల‌ర్‌లో ప‌క్కా మాస్ ఎలిమెంట్స్ ఉండ‌డంతో ఈ చిత్రం పై ఆడియ‌న్స్‌ల‌తో అంచ‌నాలు అమాంతం పెంచేశాయి. ఆ అంచ‌నాల‌ను ఈ పందెంకోడి జోడీ పూర్తిగా అందుకోలేద‌నే చెప్పాలి. ఎందుకంటే తెలుగులో ఇప్పటికే రాయ‌ల‌సీమ బ్యాగ్రౌండ్‌లో అనేక చిత్రాలు వ‌చ్చాయి. పందెంకోడి2 కూడా అదే ప‌గ‌లు, ప్ర‌తీకారాలు కాన్సెప్ట్‌తోనే తెర‌కెక్కింది. అయితే ఈ స్కిప్ట్‌ని లింగుస్వామి స‌రిగ్గా డిజైన్ చేసుకోలేక‌పోయాడే చెప్పాలి.

ఇక బ్యాక్‌డ్రామ్ మ‌న‌దే అయినా.. త‌మిళ వాస‌న‌లు అధికంగా ఉన్న ఈ చిత్రం తొలిభాగం ప‌ర్వాలేద‌ని అనిపించినా.. రెండ‌వ‌భాగం మాత్రం ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించింద‌నే చెప్పాలి. పాత‌చింత‌కాయ ప‌చ్చ‌డిలాగా సేమ్ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో ఈ చిత్రాన్ని నింపేశాడు ద‌ర్శ‌కుడు. సీమ‌లో జరుగుతున్న జాత‌ర‌లో తిండిద‌గ్గ‌ర జ‌రిగిన చిన్న గొడ‌వ‌.. చిలికి చిలికి గాలివాన‌లా మొత్తం ఊరి గొడ‌వ‌లా మారి.. ఒక‌రిని ఒక‌రు వేటాడ‌డం, చంపుకోవ‌డం వ‌ర‌కు వెళుతుంది. ఈ సినిమా కథ అంతా మొత్తం ఏడురోజుల జాత‌ర‌లోనే సాగుతోంది.

ఫ‌స్ట్ హాఫ్‌లో కీర్తీసురేష్‌- విశాల్ ఎపిసోడ‌ల‌తో పాటు కొన్ని మంచి సీన్లు ప‌డ‌డంతో ఫ‌స్ట్ హాఫ్ సాఫీగానే సాగుతుంది .. విశాల్, కీర్తి సురేష్‌ల మధ్య వ‌చ్చే లవ్ సీన్స్ ఫ‌న్నీగా అనిపిస్తాయి.. అయితే ఈ ఇద్ద‌రి ల‌వ్ బ్రేక‌ప్ సీన్‌ని స‌రైన రీజ‌న్‌తో డిజైన్ చేయ‌లేదు ద‌ర్శ‌కుడు. ఇక సెకండాఫ్ మాత్రం పూర్తిగా గాడి త‌ప్పిపోయి భారంగా అనిపిస్తోంది. ప‌క్కా మాస్‌కు స‌రిపోయే రివేంజ్ డ్రామానే క‌థా వ‌స్తువుగా తీసుకున్న లింగుస్వామి ట్రీట్‌మెంట్ స‌రిగ్గా ఇవ్వ‌లేక పోయాడు. ఇక త‌న తండ్రి పరిస్థితిని ఊరి ప్రజలకు తెలియకుండా బాలు ఆడే రెండు, మూడు సన్నివేశాలతో సినిమా కొంత మెరుగ్గా అనిపించినా.. ఈ సినిమా అధిక భాగం లాజిక్‌లు లేకుండా సాగుతుంది.

ఇక ఈ చిత్రంల‌త‌తో విశాల్ ఎప్పటిలానే త‌న‌కు ఇష్ట‌మై యాక్షన్ సన్నివేశాల్లో రెచ్చిపోయి న‌టించారు. క్లైమాక్స్‌తో పాటు కొన్నిస‌న్నివేశాల్లో విశాల్ న‌ట‌న పీక్స్‌కు వెళ్ళింది. కీర్తిసురేష్ అల్ల‌రిపిల్ల‌లా త‌న‌వంతు కృషి చేసింది. ఈ చిత్రంలో కీలకమైన పాత్ర వరలక్ష్మీ శరత్ కుమార్‌ది. ఈ క్యారెక్ట‌ర్‌లో వ‌ర‌ల‌క్ష్మీ విశ్వ‌రూప‌మే చూపించింది. భ‌వానీ పాత్ర‌లో ఆమె చూపిన రౌద్రం ప్రేక్ష‌కుల‌కు చాలా కాలం పాటు గుర్తు ఉంటుంది. ఇక‌ విశాల్ తండ్రిగా న‌టించిన సీనియర్ నటుడు రాజ్ కిరణ్ మ‌రోసారి ఆక‌ట్టుకునే విధంగా నటించాడు. ఇక ఆ చిత్రంలో న‌టించిన వారి పేర్లు తెలియ‌క‌పోయినా వారంతా ప‌ర్వాలేద‌నిపించారు.

పందెంకోడి2కి క‌ధే పెద్ద మైన‌స్ అనుకుంటే.. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం కూడా తేలిపోయింది. బ్యాగ్రౌండ్ స్కోర్ ప‌ర్వాలేద‌నిపిస్తోంది. ఇక శక్తివేల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జ‌రుగుతున్న‌ జాతర సెటప్‌ను చాలా కలర్ ఫుల్‌గా చూపించారు. ఎడిట‌ర్ కే ఎల్ ప్ర‌వీణ్ ఎడిటింగ్ ప‌ర్వాలేద‌నిపిస్తోంది. కొన్ని అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు క‌ట్ చేస్తే పోయేది. కొన్ని సీన్లు మ‌రీ సాగ‌దీసిన‌ట్టు అనిపిస్తోంది. ఇక ఫైన‌ల్‌గా చెప్పాలంటే మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే బ్యాక్‌డ్ర‌ప్‌తో కథ‌ను ఎంచుకున్నా దాన్ని తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు లింగుస్వామి పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో ఈ చిత్రం త‌మిళ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నా తెలుగు ప్ర‌క్ష‌క‌ల చేత పాస్ మార్కులు కూడా వేయించుకోవ‌డం క‌ష్ట‌మే.

ఎమోషన్ తో సాగే యాక్షన్ సినిమా

Reviewed By 123telugu.com |Rating : 3/5

మాస్‌ను మెప్పించే పందెంకోడి2

Reviewed By Thehansindia.com|Rating : 2.75/5

పందెంకోడి 2… స్పీడు త‌గ్గ‌లేదు

Reviewed By indiaglitz.com|Rating : 3/5