హిట్టా లేక ఫట్టా : నా నువ్వే- ఆకట్టుకోలేకపోయింది!

Friday, June 15th, 2018, 08:05:29 PM IST

తన మూవీ కెరీర్లో ఎక్కువగా మాస్, కమర్షియల్ చిత్రాల్లోనే నటించిన నందమూరి కళ్యాణ్ రామ్, మొదటి సారి తన ట్రాక్ మార్చి పూర్తి తరహా ప్రేమకథలో నటించారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఆయనతో కలిసి నటించిన చిత్రం నా నువ్వే. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించే టాక్ తెచ్చుకుంది. ఇదివరకు హీరో సిద్ధార్థతో 180 వంటి విభిన్న చిత్రాన్ని రూపొందించిన జయేంద్ర దీనికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించగా, కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకంపై మహేష్ ఎస్ కోనేరు, కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి సంయుక్తంగా నిర్మించారు. శరత్ సంగీతం, ప్రముఖ సినిమాటోగ్రాఫేర్ పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫీ అందించారు. ఆర్జే గా పనిచేసే మీరా విధి మూలంగా వరుణ్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. ఆ తర్వాత మీరా తన మీద పెంచుకున్న ప్రేమను చూసి వరుణ్ కూడా ఆమెను ప్రేమిస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల అనుకోకుండా కనిపించకుండా పోయిన వరుణ్ కోసం మీరా ఏక ధాటిగా 36 గంటలపాటు చేసే ప్రయత్నమే ఈ చిత్ర కథ.

చిత్ర పాజిటివ్ పాయింట్ల గురించి చెప్పుకుంటే, చిత్రంలో హీరో కళ్యాణ్ రామ్, హీరోయిన్ పాత్రలో తమన్నా మంచి నటన కనబరిచారని చెప్పాలి. హీరోయిన్ వైపు నుండి సాగె ఈ ప్రేమకథలో అది కూడా ఒక రకంగా కొత్త పాయింట్ అని చెప్పుకోవాలి. సినిమా మొత్తం మంచి క్లాస్ లుక్ తో సాగుతుంది. హీరో కళ్యాణ్ రామ్ స్టైల్ గా మంచి ఇంటెలిజెంట్ క్యారెక్టర్ లో బాగా నటించారు. ఇక తమన్నా రొమాంటిక్ సన్నివేశాలు, డాన్సుల్లో అదరగొట్టిందని చెప్పకతప్పదు. పిసి శ్రీరామ్ కెమెరా పనితనం బాగుంది, నిర్మాతలు సినిమాకోసం పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. వారు ఈ సినిమాని సాంకేతికంగా, పిక్చరైజేషన్, క్వాలిటీ పరంగా ఉన్నత స్థానంలో నిలబెట్టారు. ముఖ్యంగా దర్శకుడు జయేంద్ర 180 వలే ఈ చిత్రంలో కూడా ఒక డిఫరెంట్ పాయింట్ ని అంటే విధిని వినూత్నంగా లవ్ కోసం వినియోగించడం బాగుంది. అలానే ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు, ద్వితీయార్ధంలో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి. ఇక వెన్నెల కిశోర్, బిత్తిరి సతుల కామెడీ పర్వాలేదనిపిస్తుంది. ఇక ఈ చిత్రం లో నెగటివ్ పాయింట్ల గురించి చెప్పుకుంటే, ముఖ్యంగా విధి ప్రకారం ప్రేమ కథను నడపడం అనే పాయింట్ బాగున్నా, దానికి దర్శకుడు చిత్రీకరణలో చాలా వరకు తడబడ్డని చెప్పుకోవచ్చు. హీరోయిన్ తమన్నాను ఎక్కువగా సినిమాలో ఎలివేట్ చేసిన దర్శకుడు, హీరో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ పై కూడా మరి కొత్త దృష్టి పెట్టవలసింది.

మొదటి అర్ధ భాగంలో హీరో, హీరోయిన్ల స్వభావాలు, విధి వంటి విషయాలపై దృష్టిపెట్టిన దర్శకుడు రెండవ అర్ధభాగం పై కూడా ఇంకొంత శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. చాలావరకు సన్నివేశాలు నామమాత్రం గానే అనిపిస్తాయి. అందునా కథనం నిదానంగా సాగడంతో ప్రేక్షకుడి సహనానికి కొంత పరీక్ష ఎదురవుతుంది. ఇక చిత్రం మొత్తం విధి వల్ల సాగుతుండడంతో చిత్రంలోని ప్రధాన పాత్రలు ఎటు వెళ్తున్నాయని కొంత గందరగోళం ఏర్పడుతుంది. ఇక శరత్ అందించిన సంగీతం బాగున్నా పాటలకు సరైన సిట్యుయేషన్ కుదరకపోవడంతో వాటి ఫ్లేవర్ దెబ్బతిన్నది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగున్నా చిత్రంలో వారిద్దరూ కలిసే రొమాంటిక్ సన్నివేశాలు తక్కువ ఉండడం ఒకింత నెగటివ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇక క్లైమాక్స్ కూడా నాటకీయంగా అనిపించడం కొంతవరకు నెగటివ్ అనే చెప్పాలి. మొత్తంగా చూస్తే విధి మూలంగా సాగే ఈ కథలో దర్శకుడు కథనాన్ని నడపడంలో హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలను మరింత ఆకట్టుకునేవిగా రాసుకుంటి ఉంటే బాగుండేది, ఇక మొదటి అర్ధభాగం బాగున్నప్పటికీ, రెండవ అర్ధ భాగం పై కూడా మరింత ఫోకస్ చేసి ఉండాల్సింది. ముగ్గురు నిర్మాతల నిర్మాణ విలువలు, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్ సీన్లతో పర్వాలేదనిపించేలా వుంది ఈ చిత్రం. ఇక హీరో కళ్యాణ్ రామ్, దర్శకుడు జయేంద్ర చేసిన ఈ చిత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయినా, కొత్తగా చేసిన వారి ప్రయత్నం మాత్రం బాగుందని చెప్పుకోవాలి……

నా నువ్వే – పూర్తిస్థాయిలో మెప్పించలేదు

Reviewed By 123telugu.com |Rating :2.75/5

నా నువ్వే – మ్యాజిక్ లేదు

Reviewed By greatandhra.com |Rating :2/5

నా నువ్వే – బలం లేదు

Reviewed By chitramala.com |Rating : 2/5

నా నువ్వే – లవ్ లేదు, లాజిక్ లేదు

Reviewed By gulte.com |Rating : 2.5/5