రానున్న రోజుల్లో హోదా ఉద్యమం తీవ్రతరం చేస్తాం : చలసాని శ్రీనివాస్

Monday, June 11th, 2018, 11:24:10 AM IST

ఎన్డీయే ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన విభజన హామీలు, అలానే ఆంధ్రకు ప్రత్యేక హోదా విషయమై మాట తప్పిందని పలు రాజకీయ పార్టీలు బీజేపీ పై నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే అధికార టీడీపీ కూడా బిజెపి విధానాలపై వ్యతిరేకత చూపి చివరకు ఎన్డీయే నుండి వైదొలిగింది. ప్రధాని మోడీ, అమిత్ షా సహా ఆ పార్టీ నేతలందరూ ఆంధ్రపై కుట్ర పన్నారని, ఎంతో దీన స్థితిలో విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవలసిన అవసరం మన అందరిపైనా వుందని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. నిన్న విజయవాడలో హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హోదా అనేది పూర్తి అయిన అంశం అని కొందరు అంటున్నారని, అయితే హోదా ఉద్యమం దాని ఫలితాన్ని సాధించేవరకు జీవించే ఉంటుందన్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు హోదా కోసం తమ వంతుగా పోరాటం నిర్వహిస్తున్నాయని, అలా పోరాడని పార్టీలు ఆంధ్ర ద్రోహుల పార్టీలుగా నిలిచిపోతాయన్నారు.

హోదా సాధన బాధ్యత ప్రతిఒక్క ఆంధ్రుడి మీద ఉందని అయన అన్నారు. ఇప్పటివరకు పోరాడిన వైనాన్ని ఇకపై రానున్న రోజుల్లో మరింత తీవ్ర తరం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 15 తర్వాత కొన్ని విద్యార్థి సంఘాలతో సమావేశమై పలు కాలేజీల్లో హోదా సంబంధించి సదస్సులు కార్యక్రమాల నిర్వహణ ఉంటుందన్నారు. పార్టీలన్నీ విడివిడిగా పోరాటం చేస్తే బలం ఉండదని, పైగా ఆ విధంగా పోరాడటాన్ని చూసి ఢిల్లీ నేతలు నవ్వుకుని పట్టించుకోవడంలేదని విమర్శించారు. అందువల్లనే అందరం కలిసికట్టుగా మన రాష్ట్రంకోసం పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమయిందని ఆయన పిలుపునిచ్చారు. ఇక జులైలో పలు విశ్వవిద్యాలయాల్లో బస్సు యాత్రలు జరిగిపి యువతీ యువకుల్లో హోదా పట్ల చైతన్యం తీసుకొస్తామన్నారు. నెలలో ఒకరోజు ర్యాలీలు, అలానే 24గంటలపాటు జాతీయ రహదారుల దిగబద్ధం వంటి కార్యక్రమాలతో కేంద్రం మెడలు వంచుతామని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలన్నీ కూడా సంఘటితంగా కలిసికట్టుగా ముందుకువచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. అప్పుడే అందరం కలిసి హోదా సాధించుకోగలమని అన్నారు………

  •  
  •  
  •  
  •  

Comments