నెక్స్ట్ ఎలెక్షన్స్ లో టీడీపీకి గెలిచే సత్తా ఎంతవరకు ఉంది?

Monday, June 25th, 2018, 06:30:13 PM IST

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగేళ్లు దాటింది. కాగా గత ఎన్నికల్లో టీపీడీ వారు కేంద్ర ఎన్డీయే నేతృత్వంలోని బిజెపి తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటు ఏపీలో ఆ సమయంలో నూతనంగా ఆవిర్భవించిన జనసేన మద్దతుతో ఎన్నికలకు వెళ్లి విజయఢంకా మ్రోగించారు. రాష్ట్రం అత్యంత కష్టపరిస్థితుల్లో విడిపోవడం, అనుభవజ్ఞుడైన చంద్రబాబు వంటి నాయకుడి సేవలు రాష్ట్రానికి అవసరం అవడంతో ప్రజలు టిడిపికే మొగ్గు చూపారు. ఇక అప్పటినుండి పాలన ప్రారంభించిన చంద్రబాబు రేషన్ కార్డులు, రైతులకు రుణ మాఫీ, రాజధాని అభివృద్ధికి భూ సేకరణ, ఆ ప్రాంత అభివృద్ధి తదితర కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. అయితే విభజన హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి సమస్యలు నెరవేరుస్తామని బిజెపి హామీ ఇచ్చిన మేరకు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న బాబు ఆ తరువాత వారు హోదా కంటే ప్యాకెజీ వల్ల తమ రాష్ట్రానికి ఎక్కువ మేలు చేకూరడమేకాక నిధులు సమీకరణ కూడా ఎక్కువ జరుగుతుందని ఆశించి ఒప్పుకున్నారు. అయితే రాను రాను జాతీయ బీజేపి నేతలయిన మోడీ, అమిత్ షాలు ఏపీపై శ్రద్ధ పెట్టడం లేదని,

అంతే కాక మొత్తం నాలుగు బడ్జెట్ లు వరుసగా వెళ్లిపోవడం, అందులో ఏ ఒక్క బడ్జెట్ లోను రాష్ట్రానికి సరైన న్యాయం జరగకపోవడంతో టీడీపీ నేతలు బిజెపి పై తమ నిరసన గళం విప్పడం మొదలుపెట్టారు. పోలవరం ప్రాజక్టు, ఇతర ఇరిగేషన్ ప్రోజెక్టుల విషయమై ఇస్తామన్న నిధులు ఇవ్వడంలేదని విమర్శించ సాగారు. అయితే టీడీపీ నేతలు చెపుతున్నవన్నీ అబద్ధాలని, కేంద్రం చెప్పిన ప్రకారం దాదాపుగా అన్ని హామీలు నెరవేర్చమని బిజెపి చెపుతుండడం గమనార్హం. అక్కడినుండి రెండు పార్టీల మధ్య అంతర్యుద్ధం మొదలై చివరికి టీడీపీ ఎన్డీయే నుండి బయటకు రావడం జరిగింది. అయితే ఇందులో చంద్రబాబు ముందుగా హోదా విషయమై పోరాడుతున్న ఇతర పార్టీలను తప్పుపట్టడం, ఆ తరువాత ప్యాకెజీ ఇస్తున్నారని చెప్పడం ప్రజల్లో కొంత ఆనందం నింపినప్పటికీ, అది కూడా వొట్టి నీటి మూట అని తేలడంతో ప్రజల్లో ఆ పార్టీపై కొంత నిరాసక్తత మొదలైందని చెప్పాలి. ఇక రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములను ప్రజలనుండి బలవంతంగా లాక్కున్నట్లు కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేయడం, ఈ మేరకు కొందరు రైతులు అది నిజమేనంటూ బయటకు రావడం కూడా వారికి కొంత నష్టం కలిగించే పరిణామం. ఇక అప్పటి మానిఫెస్టోలో చెప్పినట్లు ముఖ్యంగా రైతు రుణ మాఫీ పూర్తిగా చేయలేకపోవడం, ఇక నిరుద్యోగ భృతి వంటి అంశాలని పక్కన పెట్టడం కూడా వారికీ ప్రతికూలాంశంగా మారె అవకాశం వుంది.

ప్రతిపక్ష నాయకులు చెపుతున్నట్లు చంద్రబాబు వస్తే రాష్ట్రం సుభిక్షంగా వుండడమేకాక పలు అభివృద్ధి కార్యక్రమాలతో నూతన రాజధాని నిర్మాణం చేపట్టవచ్చని అనుకున్నట్లుగా సఫలీకృతం కాకపోవడంతో టీడీపీ ఆ విషయంలో కొంతవరకు ప్రజల్లో నెగటివ్ ఇంపాక్ట్ తెచ్చుకుందని చెప్పక తప్పదు. మొత్తంగా చెప్పాలంటే చంద్రబాబు ఏపీకి రావలసిన నిధులు, ఇతర కేటాయింపుల విషయమై కేంద్రం ముందు గట్టిగా నిలబడి మాట్లాడలేకపోయారు అనే వాదన మాత్రం బలంగా వుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే టీడీపీకి అంటూ మొదటినుండి వున్న కోటరీ, అలానే చంద్రబాబు వ్యూహరచన, ఎక్కడ ఎటువంటి అభ్యర్థులను నిలబెడితే విజయం సాధిస్తారు అని కొంతవరకు అంచనా వేయగలగడం ఆ పార్టీకి వున్న కొంత బలం. అలానే ఆయన ప్రవేశపెట్టిన కొన్ని పధకాలు కూడా వారికీ శ్రీరామ రక్షా అని చెప్పక తప్పదు. ఇక జనసేనపార్టీ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం టిడిపికి ఒకరకంగా ఓట్లను చీలుస్తుందని చెప్పక తప్పదు. ఇక వైసిపి అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రజల్లోకి బాగానే వెళ్లినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇదివరకు ఎన్నికల్లో పోటీచేసిన అనుభవం ఉండడం, అదియే కాక చాలావరకు గతఎన్నికల్లో సీట్లు దక్కించుకున్న చరిత్ర వున్న వైసీపీ ఈ సారి టీడీపీ వారికీ గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో కొంతవరకు గట్టి పోటీని, గడ్డు పరిస్థితులను ఎదుర్కొనకతప్పదని చెప్పవచ్చు. ఇక ప్రజల నాడిని పసిగట్టి వరివోట్లను ఏమేరకు ఆ పార్టీ చేజిక్కించుకుంటుందో తెలియాలంటే రానున్న ఎన్నికల వరకు ఆగక తప్పదు మరి…..