భార్య బిడ్డల పాలిట కాలయముడైన భర్త !

Tuesday, February 6th, 2018, 03:00:31 PM IST

సొంత ఇల్లు, భార్య, ఇద్దరు పిల్లలు, ఏది కావాలన్న సమకూర్చి ఆదరించే కుటుంబ సభ్యులు. ఇలా సాఫీగా సాగుతున్న జీవితాన్ని తన ఉన్మాదంతో సర్వనాశనం చేసుకున్న వ్యక్తి ఉదంతం ఇది. రెండేళ్లుగా వ్యాపారం చేయకుండా ఖాళీగా తిరుగుతున్న ఆ ఉన్మాది ఇద్దరు పిల్లలు, భార్యను చేతులారా హత్య చేసి పొలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన నగర సమీపంలోని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధి జిల్లెలగూడ సుమిత్రా ఎన్‌క్లేవ్‌లో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, వికారాబాద్‌ జిల్లా కుల్కచర్లకు చెందిన నారాయణగౌడ్‌ రెండో కుమారుడు మాలె హరేందర్‌గౌడ్‌ (35) కు మహబూబ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన సత్యనారాయణగౌడ్‌ పెద్దకుమార్తె జ్యోతితో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహమైంది.
హరేందర్‌గౌడ్‌ మలక్‌పేటలో పళ్ల క్యాప్‌లను తయారు చేసే ల్యాబ్‌ ను స్వంతంగా నిర్వహిస్తున్నాడు. ఈ భార్యాభర్తలకు అభితేజ్‌ (7), సహస్ర (5) అనే ఇద్దరు పిల్లలున్నారు. జిల్లెలగూడలోని సుమిత్రా ఎన్‌క్లేవ్‌లోని సొంతింట్లో జీవిస్తున్నారు. ల్యాబ్‌ను సక్రమంగా నడపకుండా రెండేళ్లుగా హరేందర్‌గౌడ్‌ ఖాళీగా తిని తిరుగుతున్నాడు. అయితే చాలా రోజుల నుండి అతని తండ్రి, మామయ్యలే కుటుంబభారం మొత్తం మోస్తున్నట్లు తెలుస్తోంది. చాన్నాళ్ల నుండి పనిచేయకుండా తిరుగుతున్న హరేందర్‌ను తండ్రి నారాయణగౌడ్‌, అన్న కృష్ణ ల్యాబ్‌ సరిగా నడవడంలేదని, ఆర్డర్లు రావడంలేదని ఇకనైనా సక్రమంగా పని చేసుకుని కుటుంబాన్ని చక్కగా చూసుకోమని గట్టిగా నిలదీశారు. అంతే కాక వారే స్వయంగా వైద్యుల వద్దకు తీసుకెళ్లి ఆర్డర్ లు ఇప్పించి మాట్లాడారు. ఉన్నట్లుండి ఏమయిందో తెలియదు గాని సైకోగా మారిన హరేందర్ ఆదివారం తెల్లవారుజామున భార్య, కుమారుడు, కుమార్తెని అత్యంత కిరాతకంగా హత్యచేశాడు. ముందుగా భార్యను పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపాడు. ఈ సమయంలో వారి మధ్య తీవ్ర పెనుగులాట జరిగి ఉండవచ్చని, అక్కడ చిందర వందరగా పడిన వస్తువులను బట్టి తెలుస్తోందని అర్ధం అవుతుంది. ఆమె నోట్లో నుంచి తీవ్ర రక్త స్రావం జరిగినట్లు సమాచారం.
ఆ తర్వాత పడకగదిలో పడుకుని వున్న అభితేజ్‌, సహస్ర లను కూడా గొంతు నులిమి హత్యచేశాడు. తెల్లవారేవరకు అక్కడక్కడే తిరిగిన అతడు ఉదయం కాలనీ అధ్యక్షుడి దగ్గరకు వెళ్లి భార్య, పిల్లలను తానే చంపానని పోలీస్‌స్టేషన్‌ వరకు రావాలని కోరగా దిగ్బ్రాంతి కి గురైన ఆయన కొంత ఆలస్యం చేయడంతో తానే స్వయంగా వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు కాలనీవాసులు తెలిపారు. సమాచారం అందుకున్న డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ మన్మోహన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌లతో విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అయితే పోలీసులు మాత్రం నిందితుడు పరారీలో వున్నాడని చెప్తుండడం కొసమెరుపు. తాతా మా ఇంటికి రావా అంటూ నా మనువడు, మనుమరాలు ఆదివారమే ఫోన్‌ చేశారని, వారం రోజుల్లో వస్తామని చెప్పామని కన్నీటి పర్యంతమయ్యారు జ్యోతి తల్లిదండ్రులు సత్యనారాయణగౌడ్‌, వజ్రమ్మ. ఇంతలోనే ఇంతటి దారుణానికి హరేందర్‌ ఒడిగడతాడని ఊహించలేదని, తనకి బిడ్డలను పెంచడం చేతకాకపోతే, తమ వద్దకు పంపించినా చక్కగా చూసుకునేవాళ్లమని కన్నీరుమున్నీరయ్యారు. తమకు ముగ్గురు కుమారులు, జ్యోతి ఒక్కతే కూతురని అందుకే ఆమెని ఎంతో అపురూపంగా చూసుకున్నామన్నారు. కానీ హరేందర్ పని చేయకుండా ఆమెని చాలా సార్లు వేధించాడని, అయితే తాము కలుగచేసుకుని సర్ది చెప్పేవాళ్లమన్నారు. ఇంత కిరాతంగా జ్యోతిని, ఆమె బిడ్డలను హత్య చేసిన హరేందర్ ను విడిచిపెట్టకూడదని, తగిన శిక్ష విధించాలని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు….