బెజవాడలో భర్త దుశ్చర్య….ఏమి జరిగిందంటే?

Friday, April 13th, 2018, 02:47:48 PM IST

ప్రస్తుత సమాజంలో కొందరి ఆలోచన ధోరణి వికృత రూపం దాలుస్తోంది. అందునా మరీ ముఖ్యంగా భార్యా భర్తల మధ్య సత్సంబంధాలు రోజురోజుకీ తగ్గిపోవటమే కాదు వారి మధ్య నమ్మకం అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారుతోంది. దీనికి తగ్గట్లే ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న కొన్ని ఉదంతాలు వీటికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కొన్ని కాపురాల్లో అయితే భార్యాభర్తలు ఒకరివైఖరి నచ్చక మరొకరు హత్యలు చేయించడం వంటి ఘటనలు కొన్ని చూస్తున్నాము. అయితే ఒక కొత్త తరహా వికృత చర్య ఒకటి తాజాగా బయటకు వచ్చింది. బెజవాడలో వెలుగు చూసిన ఈ ఘటనను వింటే చిరాకు పుట్టటమే కాదు అసహ్య భావన కలుగుతుంది. విషయం లోకి వెళితే, బెజవాడలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత రాజరాజేశ్వరిపేట జెండా చెట్టు ప్రాంతంలో మల్లికా సుల్తానా అనే 27 మహిళకు భవానీపురానికి చెందిన రియాజ్ అనే వ్యక్తితో ఇటీవల పెళ్లి జరిగింది.

అయితే వీరిద్దరికి గతంలో విడివిడిగా పెళ్లిళ్లు జరిగి విడాకులు తీసుకున్నారు. ఇద్దరికీ రెండో పెళ్లి అయినా, కట్న కానుకులకు ఎలాంటి లోటు లేకుండా చూశారు అమ్మాయి మల్లికా తల్లితండ్రులు. పాత టైర్ల వ్యాపారం చేసే రియాజ్ కు కడప జిల్లాకు చెందిన రహమాన్ అనే స్నేహితుడు ఉండేవాడు. అప్పుడప్పుడు కడప జిల్లా నుంచి బెజవాడకు భార్యతో పాటు వచ్చేవాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉండే వీరి మధ్యన ఊహించని పరిణామం ఒకటి పుట్టుకొచ్చింది. మల్లికా సుల్తానా అంటే తనకు ఇష్టమని తనను పెళ్లి చేసుకోవాలంటూ రహమాన్ ఆమెను ఇబ్బంది పెట్టటం మొదలెట్టాడు. ఊహించని రెహమాన్ వైఖరితో బెదిరిపోయిన సుల్తానా ఈ విషయాన్ని భర్తకు చెప్పి వాపోయింది. అయితే అది విని మౌనంగా ఉన్న భర్త నుంచి స్పందన లేకపోవటంతో సుల్తానాకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి.

ఇదిలా ఉండగా, ఈ మధ్యన సుల్తానాకు రహమాన్ భార్య ఫోన్ చేసి నువ్వంటే నా భర్తకు ఇష్టం, అతన్ని పెళ్లి చేసుకో, నేనేం అభ్యంతరం పెట్టను అని చెప్పటంతో మల్లికా ఆశ్చర్యపోయింది. ఇదే విషయాన్ని మళ్లీ భర్తతో చెబితే, నేను వ్యాపారం కోసం కొంత డబ్బు రహమాన్ నుండి తీసుకున్నాను, కాబట్టి అతన్ని పెళ్లి చేసుకో, లేకాపోతే అప్పు ఇప్పటికిప్పుడు తీర్చమని ఇబ్బంది పెడతాడన్న మాటతో ఆమె షాక్ తిన్నది. అయితే భర్త మాటకు ససేమిరా అనడంతో, ఆగ్రహించిన అతడు సుల్తానాను తీవ్రంగా కొట్టటమే కాదు, వెంటనే పుట్టింటికి పంపేశాడు. దీంతో, తనకు న్యాయం చేయమంటూ సుల్తానా పోలీసుల్ని ఆశ్రయించింది. అండగా ఉండాల్సిన భర్తే, ఇలా స్నేహితుడిని పెళ్లి చేసుకోమని అంటున్నాడని ఆమె పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ప్రస్తుతం విజయవాడలో సంచలనంగా మారింది……