దేశ రెండవ రాజధానిగా భాగ్యనగరి?

Thursday, January 25th, 2018, 09:56:34 AM IST


ఒకరకంగా ఇది కనుక నిజమైతే ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయమని చెప్పాలి. ప్రస్తుతం తెలుగు వారి నోట జరుగుతున్న చర్చ, అందునా తెలంగాణ ప్రజలు మరింత చర్చిస్తున్న అంశం. ఒక వేళ హైద్రాబాదును దేశానికి రెండవ రాజధానిగా చేసినట్లయితే కలిగే లాభ నష్టాల విషయమై కూడా ప్రజల్లో ఇప్పుడు కొంత ఆసక్తికర చర్చే మొదలైయింది. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ ను దేశ రెండవ రాజధానిగా చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, ఆ విధమైన ప్రకటన కేంద్రం ద్వారా వస్తే దానిని తాము స్వాగతిస్తామని, అంత కంటే ఆనందం ఏముంటుందని ఆయన మొన్న ఒక ప్రకటన చేశారు. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత ముంబై, కోల్కటా వంటి నాగరాలున్నా హైదరాబాద్ కు కేంద్రపెద్దలు ఓటేస్తున్న వైనం గర్వించదగ్గదే. నిజానికి చాలా కాలం క్రితం ఈ రెండవ రాజధాని అంశాన్ని తెర పైకి తెచ్చారు. రాష్ట్ర విభజన కు సంబంధించి ఏ తరహా చర్యలు చేపడితే అన్నివిధాలా బాగుంటుందో చెప్పాలంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమీషన్, రెండు రాష్ట్రాలకు చెరొక రాజధానిని నిర్మించి ఇచ్చి హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధానిగా చేస్తే సరిపోతుందని సలహాఇచ్చారు. అయితే అంతకు పూర్వమే ఈ వాదన తెరమీదకు వచ్చినా, తర్వాత ముందుకు సాగలేదు. ఆ తదనంతర పరిణామాల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడం హైదరాబాద్ ను పది ఏళ్ళ పాటు ఉమ్మడిగా, తరువాత తెలంగాణ రాజధానిగా ప్రకటించడం మనకు తెలిసిందే.

అయితే ఇన్నాళ్లకు మళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన అనంతరం తెలంగాణ జేఏసీ కి నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం కేసీఆర్ వ్యాఖ్యలను విభేదించారు. రెండవ రాజధానిగా హైదరాబాద్ ను ప్రకటించడం ఆనందకర విషయమని కేసీఆర్ అనడం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడమే అని విమర్శించారు. అలా చేస్తే హైదరాబాద్ ని తెలంగాణ నుండి వేరు చేయడమేనని, అప్పుడు హైదరాబాద్ ఆదాయం కేంద్రానికి వెళ్తుందని, ఈ విధంగా కేసీఆర్ ఆంధ్రాకి మేలు చేసేలా మాట్లాడుతున్నారని అన్నారు. అయితే ఈ విధంగా హైదరాబాద్ ను రెండవ రాజధానిగా చేస్తే తెలంగాణ కు నష్టమన్న ఆయన ఏపీ కి మాత్రం ఏవిధంగా లాభం అనే విషయం పై స్పష్టత ఇవ్వలేకపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ప్రతిపాదన తమవద్దకు వస్తే దాన్ని వ్యతిరేకించామని, ఆ నాడు ఉద్యమ పార్టీగా వున్న టిఆర్ఎస్ తో పాటు ఆ పార్టీ అదినేత గా వున్న కేసీఆర్ కూడా ఆ ప్రతిపాదనను వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పుడు ఆలా సరికాదని, ఇప్పుడు కరక్టే అని కేసీఆర్ అన్న మాటల్లోని ఆంతర్యం ఏంటని విమర్శించారు. మళ్లి ఇన్నాళ్లకు తెరపైకి వచ్చిన ఈ రెండవ రాజధాని అంశం చివరకు ఎలా ముగుస్తుందో కేంద్రం చేతుల్లోనే ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు….