గ్రహణం రోజు ఆ చిన్నారి బలి.. వీడిన మిస్టరీ !

Wednesday, February 7th, 2018, 02:55:20 AM IST

గత కొన్ని రోజులుగా నగరంలో సంచలనం సృష్టిస్తోన్న ఓ చిన్నారి నరబలి కేసు మిస్టరి ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. మూఢ నమ్మకాలతో కొందరు చేసిన క్షుద్రపూజల ఆలోచన వలన ఓ చిన్నారి బలైంది. హైదరాబాద్ ఉప్పల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక్క సారిగా అందరిని షాక్ కి గురి చేసింది. భార్య ఆరోగ్యం కోసం ఓ భర్త వేసిన ప్లాన్ అని తెలుస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ చిలకనగర్ లో గత కొన్నేళ్లుగా క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్(35) నివాసం ఉంటున్నాడు. అయితే గత గురువారం అతని అత్త ఉతికిన బట్టలు ఆరేయడానికి మేడ పైకి వెళ్లగా..మొండెం లేకుండా ఉన్న చిన్నారి తల కనిపించింది.

దీంతో ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి ఇంట్లో చెప్పగా రాజశేఖర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపగా వారికి ఎలాంటి ఆధారం దొరకలేదు. ఇంటి యజమాని రాజశేఖర్ పై అనుమానం వచ్చి గట్టిగా విచారించడంతో అసలు విషయం బయటపడింది. గత కొంత కాలంగా భార్య ఆరోగ్యం భాగోలేకపోవడంతో గ్రహణం రోజు క్షుద్ర పూజ కోసం పాపను బలిచ్చినట్లు తెలిసింది. కరీంనగర్ నుంచి ఆ పాపను తీసుకువచ్చి స్థానికంగా ఉంటోన్న మెకానిక్ నరహరి ఇంట్లో క్షుద్ర పూజలు చేసి పాపను బలిచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారికి సహాయపడిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పాప మొండెం మాత్రం ఇంతవరకు లభించలేదు. ఈ కేసుపై ఇంకా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.