బాబు వెళ్తున్నాడు.. మరి వారి పరిస్థితి ఏమిటి..?

Wednesday, December 23rd, 2015, 03:29:14 AM IST

babukcr
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెదక్ జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కెసిఆర్ నిర్వహిస్తున్న చండీయాగానికి వెళ్తున్న సంగతి తెలిసిందే. కెసిఆర్ స్వయంగా విజయవాడలోని బాబు ఇంటికి వెళ్లి ఆహ్వానించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, బాబు తీసుకున్న నిర్ణయంతో.. తెలంగాణ టిడిపి నేతలు ఇరకాటంలో పడ్డారు.

మొన్నటి వరకు ముఖాముఖి తిట్టుకున్న రెండు పార్టీల అధినేతలు ఇప్పుడు దగ్గర కావడంతో.. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఖుషిగా ఉంటె.. తెలంగాణ టిడిపి మాత్రం ఆందోళన చెందుతున్నది. బాబు వెళ్తే.. తెలంగాణలో తమ పరిస్థితి ఏమిటి అని వారంతా ఆలోచనలో పడ్డారట. ఇప్పటికే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరే ఘోరంగా తయారయింది. ఎప్పుడు లేనంతగా బలహీన పడింది. వచ్చే ఏడాది జనవరిలో గ్రేటర్ ఎన్నికలలో బలం నిరూపించుకోవడం కోసం టిడిపి తాపత్రయ పడుతున్న వేళ.. కెసిఆర్ విజయవాడ వెళ్ళడం.. బాబును కలవడం.. బాబు కెసిఆర్ యాగానికి వస్తానని చెప్పడం. చెప్పిన విధంగా నాయకులతో ఎర్రవెల్లి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయమని చెప్పడంతో.. తెలుగుదేశం పార్టీ నేతలు ఖంగుతింటున్నారు. బాబు ఇలా ప్రవర్తిస్తే.. గతంలో చెప్పినట్టు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గెలుపు సంగతి దేవుడికి ఎరుగు కనీసం పరువు దక్కుతుందా అని అని ఆలోచనలో పడ్డారట.