ఇండియన్ మిలిటరీలో చేరేందుకు దరఖాస్తు చేశా : అల్లు అర్జున్

Monday, May 7th, 2018, 10:47:35 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అను ఇమ్మానుయేల్ కథానాయికగా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో, రామ లక్ష్మి క్రియేషన్స్ పతాకం పై లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు, నాగ బాబు నిర్మించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం నా పేరు సూర్య. మొన్న 4వ తేదీన విడుదలయిన ఈ చిత్రం మంచి టాక్ తో కలెక్షన్లతో దూసుకెళుతోంది. కాగా ఈ చిత్రాన్ని నేడు హీరో అల్లు అర్జున్ కొందరు సైనికాధికారులతో కలిసి వీక్షించారు. అయితే చిత్రం పూర్తియైన తరువాత అధికారులు ఆయనకు రోజా పూలను కానుకగా ఇచ్చారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, అందరికి నమస్కారం నాపేరు అల్లు అర్జున్, నా ఇల్లు ఇండియా అంటూ తన స్పీచ్ మొదలుపెట్టారు. ఈ చిత్ర కథ విన్నప్పటినుండి ఎప్పుడెప్పుడు నటిస్తానా అనిపించేదని, చిత్రం చాలావరకు నిజమైన ఆర్మీ క్వార్టర్స్, సైనిక అధికారుల మధ్యనే చిత్రీకరించామని అన్నారు. మా తపనకి, తోడ్పాటు అందించిన సైనికాధికారులందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఈ సినిమా ఒక ఎత్తని అన్నారు. మాములుగా సినిమాల్లో నటించి హిట్ అయితే పేరు, డబ్బు వస్తాయని, అయితే ఈ చిత్రానికి వాటితోపాటు అరుదైన గౌరవం లభిస్తోందని అన్నారు.

మేము చిత్రీకరణ ప్రారంభించిన తొలిరోజుల్లోనే సైనికుల జీవితాలు, ఆ వాతావరణం చూసిన నాకు సైన్యంలో చేరాలని అనిపించిందని, అందుకే వెంటనే సైన్యంలో చేరేందుకు అనుమతికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అధికారులు ఆమోదం తెలుపగానే సైన్యంలో గౌరవ సభ్యుడిగా చేరబోతున్నాను, నేను వారిని మొట్టమొదట కోరుకున్నది అదే అని చెప్పారు. నా కెరీర్ మొత్తంలో చాలా గర్వ పడే సినిమా ఇదని, ఈ చిత్రానికి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ, అభిమానం మరిచిపోలేనివని, అభిమానులు, ప్రేక్షకులకు, ముఖ్యంగా మా డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు అందరికి థాంక్స్ అని అన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments