నాకు సరైన న్యాయం జరగలేదు, అందుకే పార్టీ మారుతున్నా : సీనియర్ నటి

Sunday, March 11th, 2018, 08:45:54 PM IST

ఒకప్పటి సీనియర్ నటి, టీడీపీ సీనియర్‌ నేత, కవిత నేడు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ లో చేరారు. ఆమె టీడీపీలో కొంతకాలం కిందటి వరకు చురుగ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే తరువాత ఆమెకు పార్టీలో తగిన గుర్తింపు దక్కలేదనే బాధతోనే టీడీపీకి రాజీనామా చేశానని ఆమె అన్నారు. బీజేపీలో చేరిన అనంతరం మీడియా తో ఆమె మాట్లాడుతూ, 1983 నుంచి టీడీపీ కోసం కష్టపడి తాను సేవలు అందించానని, అయినప్పటికీ తనకు పార్టీ సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

టీడీపీ బలోపేతం కోసం అహర్నిశలు పనిచేశానని, పార్టీ కోసం కష్టపడ్డందుకు పలురకాల అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు. పనిచేసిన వారికి సముచిత‌న్యాయం చేస్తానని చంద్రబాబు పదే పదే చెప్పేవారని, కానీ, ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌పై నమ్మకంతోనే టీడీపీలో చేరానని, చంద్రబాబు ఎన్టీఆర్ హామీని తుంగలో తొక్కారని మడిపడ్డారు. చంద్రబాబు ప్రతి పోరాటంలో తాను పాల్గొన్నానని, అయినప్పటికీ ప్రతిఫలం దక్కలేదని అన్నారు. అయితే ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన అనేక పథకాలు నచ్చడంతోనే తాను బీజేపీలో చేరానని తెలిపారు. మోడీ ప్రభుత్వం లో ప్రజలు సుఖ సంతోషాలతో వున్నారని, రానున్న ఎన్నికల్లో బిజెపి తరపున తన వంతుగా ప్రచారం చేసి పార్టీ గెలుపుకు కృషిచేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు…

  •  
  •  
  •  
  •  

Comments