గ‌జ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తా!- గ‌ద్ద‌ర్

Saturday, October 13th, 2018, 04:00:19 AM IST

ప్ర‌జా యుద్ధ‌నౌక గ‌ద్ధ‌ర్‌కి తెలంగాణ స‌హా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ చెప్పాల్సిన ప‌నేలేదు. ఆయ‌న పాట‌కు ఉన్న ప‌వ‌ర్ అలాంటిది. ఆయ‌న గ‌ళం విప్పితే, కాలుకు గజ్జె క‌ట్టి ఆడితే భూమండ‌లం క‌ద‌లాల్సిందే. అంత‌టి ప‌వ‌ర్‌ఫుల్ ప‌ర్స‌న్ కాబ‌ట్టే తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో ఆయ‌నా కీల‌క భాగ‌స్వామి కాగ‌లిగాడు. అయితే గ‌ద్ద‌ర్ నేడు జాతీయ కాంగ్రెస్‌లో చేరార‌ని, ఆయ‌న కూడా రాజ‌కీయ నాయ‌కుడు అయిపోయాడ‌ని ప్ర‌చారం సాగింది. ప్రజాగాయకుడు గద్దర్ నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కల‌వ‌డంతో ఈ పుకార్లు షికారు చేశాయి.

కాంగ్రెస్ నేతలు మధుయాష్కి, కొప్పుల రాజు, తన భార్య, కుమారుడు సూర్యకిరణ్ తో కలిసి గద్దర్ ఢిల్లీ వెళ్ల‌డంతో ఇక కాంగ్రెస్‌లో చేరిక ఖాయ‌మైంద‌ని భావించారంతా. త‌న కుమారుడికి, అనుచ‌రుల‌కు కాంగ్రెస్ టిక్కెట్లు ఇవ్వాల్సిందిగా గ‌ద్ద‌ర్ కోరార‌ని ప్ర‌చార‌మైంది. అయితే దీనిపై గ‌ద్ద‌ర్ నేరుగా స‌మాధాన‌మిచ్చారు. నేను ఏ పార్టీలోనూ చేర‌లేదు. ఎవ‌రికి చెంద‌ను! అని ఖ‌రాకండిగా చెప్పేశారు. రాజకీయ పార్టీలు, ప్రజలు కోరితే గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఫ్యూడ‌లిజానికి బ‌ద్ధ వ్య‌తిరేకిని అయిన తాను ఏ పార్టీలోనూ క‌ల‌వ‌లేన‌ని తెలిపారు. అయితే ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు అన్ని పార్టీల్ని క‌లుస్తాన‌ని అన్నారు. కేంద్రంలో బూర్జువా వ్యవస్థ పాలనకు వ్య‌తిరేకంగా `రాజ్యాంగాన్నికాపాడి దేశాన్ని కాపాడండి` అని రాహుల్ ఇచ్చిన పిలుపునకు మద్దతు తెలిపానని అన్నారు.